Site icon vidhaatha

Madhya Pradesh | కునో పార్క్‌లో మరో చీతా మృత్యువాత

Madhya Pradesh

భోపాల్‌: ఖండాంతరాలు దాటించి భారత్‌ తీసుకొచ్చిన చిరుతలు ఒకదాని తర్వాత ఒకటి మృత్యువాత పడుతున్నాయి. వేరే భౌగోళిక ప్రాంతం నుంచి చిరుతలను తెప్పించడం తగదని మొదట్లోనే విమర్శలు వచ్చాయి. అది నిజమేనని చిరుతల మరణాలు చాటుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో మరో చిరుత మృత్యువాత పడింది. ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన మగ చిరుత సూరజ్‌.. చనిపోయినట్టు అటవీశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా మరణంతో మార్చి నుంచి ఇప్పటి వరకూ చనిపోయిన చిరుతల సంఖ్య 8కి పెరిగింది. మూడు రోజుల క్రితమే తేజస్‌ అనే మగ చిరుత చనిపోయిన సంగతి తెలిసిందే.

పాల్పూర్‌ ఈస్ట్‌ ఫారెస్ట్‌ రేంజ్‌లోని మసావని బీట్‌ వద్ద శుక్రవారం ఉదయం సూరజ్‌ నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దగ్గరకు వెళ్లి చూడగా.. దాని మెడ చుట్టూ పురుగులు పట్టి ఉన్నాయి. అయితే.. కొద్దిసేపటికే అది లేచి పరిగెత్తి వెళ్లిపోయిందని, వెంటనే పశువైద్య బృందాన్ని పిలిపించి చుట్టుపక్కల వెతకగా.. 9 గంటల ప్రాంతంలో చనిపోయి కనిపించిందని తెలిపారు.

అభయారణ్య ప్రాంతంలో చిరుత చనిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. చిరుత మెడపైన, వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పూర్తి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Exit mobile version