Patients dies |
మహారాష్ట్ర థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. గడిచిన 24 గంటల్లో 18 మంది రోగులు మృతి చెందారు. ఈ విషయాన్ని థానే పురపాలక శాఖ కమిషనర్ అభిజిత్ బంగార్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.
ఆరుగురు థానేకు చెందిన వారు కాగా, కల్యాణ్ నుంచి నలుగురు, షాహపూర్ నుంచి ముగ్గురు, భివాండి, ఉల్హాస్ నగర్, గోవండి నుంచి ఒకరి చొప్పున చనిపోయారని పేర్కొన్నారు. ఇంకో రోగి మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా, ఇంకొకరు గుర్తు తెలియని వ్యక్తి అని తెలిపారు. చనిపోయిన వారిలో 12 మంది 50 ఏండ్ల పైబడిన వారున్నారని అభిజిత్ వెల్లడించారు.
థానే ఆస్పత్రిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమీక్షించారని, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని అభిజిత్ తెలిపారు. కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. కమిటీలో హెల్త్ డిపార్ట్‌మెంట్ కమిషనర్, జిల్లా కలెక్టర్, పురపాలక శాఖ చీఫ్, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్లు, సర్జన్లు మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. రోగుల మృతులకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
చనిపోయిన 18 మంది రోగులు కిడ్నీ, పక్షవాతం, న్యూమోనియా వంటి సమస్యలతో బాధపడుతున్నారని తేలిందన్నారు. రోగులకు చికిత్స అందించడంలో వైద్యుల వైఫల్యం లేదని తెలిపారు. వారి మృతికి కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.