విధాత: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని టీఎస్ ఆర్టీసీ డిపోలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు బస్సులు కాలిపోయాయి. రెండు బస్సులు పూర్తిగా దగ్ఢమవగా, ఒకటి స్వల్పగా దెబ్బతిన్నది. అయితే, ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
పోలీసులు, ఆర్టీసీ అధికారుల వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన సిటీ ఎక్స్ ప్రెస్ బస్సులో సోమవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. అక్కడ చూస్తుండగానే రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. మరో బస్సుపాక్షికంగా దెబ్బతిన్నది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే మరికొన్ని బస్సులు పార్కింగ్ చేసి ఉన్నాయి.
మంటలు చెలరేగిన వెంటనే గుర్తించడం, తక్షణం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వారు హుటాహుటిన స్పందించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. బస్సులో మంటలు ఎలా వచ్చాయన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆర్టీసీ సిబ్బందికి ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని డిపో అధికారులు భావిస్తున్నారు.