Vijay | సౌత్ ఇండియన్ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి సంచలన ప్రకటనతో అభిమానులను ఉలిక్కిపడేలా చేశారు. మలేషియాలో జరిగిన ‘జననాయగన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్లో విజయ్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తనదైన శైలిలో, భావోద్వేగంతో నిండిన మాటలతో అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విజయ్, సినిమాల నుంచి తప్పుకునే తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. వేదికపైకి వచ్చి… అయ్యా, రాజా… నా గుండెల్లో నివసించే స్నేహితులకు, స్నేహితురాళ్లకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన విజయ్, కొన్ని సినిమాల పేర్లు వినగానే మలేషియా గుర్తొస్తుందని అన్నారు. ముందుగా తన స్నేహితుడు అజిత్ నటించిన ‘బిల్లా’ పేరు చెప్పగానే స్టేడియం మొత్తం ఈలలతో మారుమోగింది. అజిత్ సినిమా గురించి విజయ్ మాట్లాడటంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన సినిమాలైన ‘కావలన్’, ‘కురువి’ లను గుర్తు చేసుకుంటూ మలేషియాతో తన అనుబంధాన్ని వివరించారు.
ప్రసంగంలో భావోద్వేగానికి లోనైన విజయ్..
శ్రీలంక తర్వాత మలేషియాలోనే ఎక్కువ మంది తమిళ ప్రజలు ఉన్నారు. నాకు ఏదైనా జరిగితే థియేటర్లలో మీరు నా కోసం నిలబడతారు. ఆ అభిమానుల కోసం రాబోయే 30–33 ఏళ్లు నేను నిలబడతాను. ఈ విజయ్, అభిమానుల కోసమే సినిమాను వదిలేస్తున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి తాను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశతో వచ్చానని, కానీ అభిమానులు తనను ప్యాలెస్‌లో కూర్చోబెట్టారని చెప్పి స్టేడియాన్ని భావోద్వేగంతో నింపారు. వరదలో కొట్టుకుపోతున్నవారికి పడవ ఎంత అవసరమో, ఎడారిలో దాహంతో ఉన్నవారికి ఒంటె ఎంత అవసరమో, తాను కూడా ప్రజలకు అలా ఉపయోగపడాలని భావిస్తున్నట్లు చెప్పారు.
‘జననాయగన్’ టీమ్‌పై ప్రశంసలు
ఈ సినిమాలో తనతో కలిసి పనిచేసిన వారిపై విజయ్ ప్రశంసల జల్లు కురిపించారు. మమిత గురించి మాట్లాడుతూ, “ఆమె ఈ సినిమా తర్వాత ప్రతి కుటుంబంలో ఒక చెల్లిలా నిలిచిపోతుంది” అన్నారు. దర్శకుడు హెచ్. వినోద్‌ని సమాజంపై ప్రభావం చూపే దర్శకుడిగా అభివర్ణించిన విజయ్, తమ కలయిక ముందే జరగాల్సిందని, అదృష్టవశాత్తూ ఇప్పుడు ఈ సినిమాతో సాధ్యమైందని తెలిపారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి మాట్లాడుతూ..
“అతను ఒక మ్యూజికల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్. అక్కడ అన్‌లిమిటెడ్ మ్యూజిక్ దొరుకుతుంది. అతను ఎవరినీ నిరాశపరచడు” అంటూ ప్రశంసించారు. అలాగే ప్రకాష్ రాజ్‌తో తన కెమిస్ట్రీ ‘గిల్లి’ నుంచి ఇప్పటికీ కొనసాగుతోందని గుర్తు చేశారు.
విమర్శలపై స్పష్టత
“జీవితంలో గెలవాలంటే మంచి స్నేహితులకంటే బలమైన శత్రువు అవసరం. విమర్శలే మనల్ని బలంగా మారుస్తాయి. నేను మొదటి రోజు నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నాను. అయినా 33 ఏళ్లుగా నా అభిమానులు నాతోనే ఉన్నారు. ఇప్పుడు వారి కోసం నేను నిలబడతాను” అని విజయ్ స్పష్టం చేశారు. ఇక చివరగా, ‘మీరు వదిలి వెళ్తున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు?’ అనే ప్రశ్నకు, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో ప్రజలకు తెలుసు. వాళ్లే చూసుకుంటారు అంటూ విజయ్ ఇచ్చిన సమాధానం అభిమానులను మరింత ఆలోచనలో పడేసింది.
మొత్తానికి, ‘జననాయగన్’ వేదికపై విజయ్ చేసిన ఈ ప్రసంగం కేవలం సినిమా ప్రమోషన్‌కే కాకుండా, ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా స్పష్టమైన సంకేతంగా మారింది. అభిమానుల కోసం సినిమాలకు వీడ్కోలు పలికిన విజయ్ నిర్ణయం, దక్షిణాది సినీ పరిశ్రమలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
