టోక్యో : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ పశ్చిమ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని టోక్యో, కాంటో ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయని జపాన్ టైమ్స్ వెల్లడించింది.
తీర ప్రాంత రాష్ట్రాలైనా ఇషికావా, నీగట, తయోమా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూకంపం కారణంగా 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా..? అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది.
ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు ఊగిపోయాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.