Jagadish Reddy : అనర్హత వేటును ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకోలేరు

ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ మంత్రి జి. జగదీష్ రెడ్డి తెలిపారు, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

విధాత, హైదరాబాద్ : అనర్హత వేటు నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకోలేరని ప్రజల ముందు అడ్డంగా దొరికిన దొంగలు వాళ్లు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరో కాపాడుతారానుకుంటే అది వాళ్ళ తెలివి తక్కువ తనమేనని..సీఎం రేవంత్ రెడ్డినే కాదు.. వాళ్ళను ఇంకా ఎవరూ కాపాడలేరనన్నారు. శుక్రవారం సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతత వేటు ఖాయమని..ఉప ఎన్నికలు రావడం.. ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు రాజకీయంగా శాశ్వతంగా బొందపెడతారన్నారు. దింపుడుకల్లం ఆశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారని.. స్పీకర్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలు చాల బలహీనంగా ఉన్నాయన్నారు. స్పీకర్ కు ఇచ్చిన సమాధానంలో పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటు అని జగదీష్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ ను కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు..జాతీయ జెండా అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయించడం హాస్యాస్పదం అని..జాతీయ జెండాను అవహేళన చేయడం సరికాదన్నారు.

ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు

దొంగతనం చేసి తప్పించుకోలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు అని..వారు ఇప్పటికే పార్టీ విశ్వాసం కోల్పోయిండ్రు..నమ్మిన పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించబోరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ… కోట్లాది మంది ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యల పై చర్చ కోసమే ఎమ్మెల్యేల ఇంటికి సీఎం వచ్చాడని అబద్దాలు ఆడుతున్నారని..సమస్యలపై చర్చ అయితే బీఆర్ఎస్ నేతలని ఎందుకు అరెస్ట్ చేయించారని ప్రశ్నించారు. పార్టీ మారకపోతే బీఆర్ఎస్ ఆఫీస్ కి ఎందుకు రావడంలేదని..బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే కేసీఆర్ ని ఎందుకు కలవడంలేదన్నారు. తప్పు చేశామని చెంపలేసుకోక ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాలు పటిష్టంగా ఉన్నాయని..తమకు ఇచ్చిన గడువు లోపు స్పీకర్ కు లీగల్ గా సమాధానం ఇస్తాం అని..అనర్హత వేటు నుంచి తప్పించుకునే ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేస్తామన్నారు.