విధాత: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) లో సహ ప్రయాణికురాలు చూపిన ప్రేమ తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఓ యువతి రెడిట్ (Reddit) లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనకు బాగా ఆకలిగా ఉందని స్నేహితులతో చెబుతుంటే.. ఆ మాటలు విని పక్కనున్న మహిళ తన ఆహారాన్ని అందించారని రాసుకొచ్చింది. ప్రుడెంట్ యాక్షన్ 3511 అనే యూజర్ తన అనుభవాన్ని రాస్తూ ‘నా ఉద్యోగం అయిపోయాక ఇంటికెళ్లడానికి రాయ్‌దుర్గ్‌లో మెట్రో ఎక్కాను.
పక్కనే ఉన్న నా స్నేహితులతో చాలా ఆకలిగా ఉంది.. ఏదైనా పర్లేదు వెంటనే తినేయాలనుంది అని చెబుతున్నా. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి బ్యాగ్‌లో జ్యూస్ బాటిల్ ఉంది. దానిని దొంగలిద్దామా అని సరదాగా అన్నా. వాళ్లు నా వైపు చూడకపోవడం వల్ల బతికిపోయా అది వేరే విషయం. ఈ సంభాషణను నా పక్కనున్న ఓ మంచి హృదయమున్న మహిళ విన్నారు. ఆకలిగా ఉందని అడిగి.. ఉదయం చేసుకొచ్చిన పులిహోర ఉందని.. ఇప్పుడూ బాగానే ఉంటుందని ఇచ్చారు. దానిమ్మ గింజలు మరో బాక్స్‌నూ ఇచ్చారు.
Just something good in metro
by u/Prudent-Action3511 in hyderabad
నేను కాస్త ఇబ్బంది పడుతూనే దానిమ్మ గింజల బాక్స్ తీసుకుని తింటుండగా.. రెండు నిమిషాలకే ఆవిడ స్టేషన్ రావడంతో దిగిపోయారు’ అని యువతి పేర్కొంది. దిగుతున్నపుడు బాక్స్ ఇచ్చేయబోతుండగా.. పర్లేదు ఉంచుకోమని చెప్పారని.. బలవంతంగానే ఆవిడకు బాక్స్ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పానని వివరించింది.
ఒక వర్కింగ్ మహిళకు బాక్స్ అనేది ఎంత పెద్ద ఆస్తో తనకు తెలుసని రాసుకొచ్చింది. దీంతో ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేయడం ద్వారా మన జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చని చెబుతూ పోస్టును ముగించింది. అయితే ఈ అనుభవాన్ని కొంతమంది మెచ్చుకుంటుండగా.. మరికొంత మంది విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మెట్రోలో ఆహార పదార్థాలు తినకుండా కఠిన నిబంధనలు ఉన్నాయని.. వాటిని పాటించడం తప్పనిసరని పేర్కొంటున్నారు.