Hyderabad Metro L&T exit | మెట్రో రైలు దిగిన ఎల్ అండ్ టీ.. రాష్ట్ర ప్రభుత్వం చేతికి ప్రభుత్వం చేతికి మెట్రో

గత కొద్ది నెలలుగా నష్టాలు భరించలేకపోతున్నాం, తప్పుకుంటామని చెబుతున్న ఎల్ అండ్ టీ అనుకున్న విధంగానే తప్పుకున్నది. ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య గురువారం చర్చలు ఫలప్రదం కావడంతో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది.

  • Publish Date - September 25, 2025 / 09:23 PM IST

హైదరాబాద్, విధాత (సెప్టెంబర్ 25)
Hyderabad Metro L&T exit | గత కొంతకాలంగా నష్టాలు వస్తున్నాయని, ఇక హైదరబాద్‌ మెట్రోను తాము నిర్వహించలేమని చెబుతూ వచ్చిన ఎల్‌అండ్‌టీ.. ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నది. ఏ సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచారో ఆ క్షణం నుంచి అనేక వివాదాలు, విమర్శలు మొదలయ్యాయి. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కొత్త రాష్ట్రం వంటి సమస్యల నుంచి బయటపడి ఎట్టకేలకు ప్రారంభానికి నోచుకుంది. కరోనా ప్రభావం, ప్రాజెక్టును విస్తరించకపోవడం, స్టేషన్ల నుంచి కనెక్టివిటీ లేకపోవడం వంటి కారణాలతో నష్టాల బాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంకురార్పణకు నోచుకుని, మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టు తిరిగి ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. ఎల్ అండ్ టీ ప్రతినిధులకు, తెలంగాణ ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది.

ఈక్విటీకింద వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌‌

గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ అండ్ గ్రూపు సీఎండీ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఫేజ్ 2 విస్తరణకు ఈక్విటీ పార్ట్ నర్ గా ముందుకు రావాలని కోరగా, సుబ్రహ్మణ్యం సాధ్యం కాదని తెలిపారు. ఫేజ్ 1, ఫేజ్ 2 కారిడార్లలో ఆపరేషన్ లో పాల్గొనాలని, ఆదాయం, పెట్టుబడులు షేర్ చేసుకుందామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఆపరేషనల్ అగ్రిమెంట్ లో పాలుపంచుకోవడం లేదని ఆయన తెలిపారు. ఫేజ్ 1 లోని కేంద్ర ప్రభుత్వ వాటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, దీంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా మారుతుందని రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీ కి స్పష్టం చేశారు. ఫేజ్ 1 కింద తమకు రూ.5,900 కోట్లు ఈక్విటీ ఇవ్వాలని సుబ్రహ్మణ్యం కోరగా, వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.2100 కోట్లు చెల్లించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఎల్ అండ్ టీ కి ఉన్న రూ.13వేల కోట్ల అప్పును చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామ‌కృష్ణా రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సుందీప్ కుమార్ సుల్తానియా, అర్బన్ డెవలప్ మెంట్ సెక్రెటరీ కే.ఇలంబర్తి, హెచ్ఎంఆర్ఎల్ ఎం.డీ సర్ఫరాజ్ అహ్మద్, అడ్వైజర్ (అర్బన్ ట్రాన్స్ పోర్టు) ఎన్.వి.ఎస్.రెడ్డి, ఎల్ అండ్ టీ గ్రూప్ సీఎండీ అడ్వైజర్ డీ.కే.సేన్, ఎల్ అండ్ టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎం.డీ కే.వీ.బీ.రెడ్డి పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అపెద్ద పీపీపీ నెట్‌వర్క్‌

హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఇందుకోసం ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఈక్విటీని కలిగి ఉంది. తొలుత 2008లో బిడ్డింగ్ పూర్తి కావడంతో మైటాస్‌కు అప్పగించగా, 2009 మార్చి నాటికి పనులు ప్రారంభించడంలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ రద్ధు చేసి తిరిగి టెండర్లు ఆహ్వానించగా ఎల్అండ్‌టీ ఎంపికైంది. 2012 లో భూమి పూజ చేయగా, 2015 లో ట్రయల్ రన్ లు ప్రారంభమయ్యాయి. 2017 లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ ఒక రూట్ కు భద్రతా అనుమతులు ఇచ్చింది. 2017 నవంబర్ నెలలో మియాపూర్ స్టేషన్ లో ప్రధాన నరేంద్ర మోదీ మెట్రో రైలుకు జెండా ఊపి ప్రయాణించారు. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, కమ్యునికేషన్ అథారిత రైలు నియంత్రణ, కోచ్ లలో సీసీ టీవీలు, రద్డీ సమయాల్లో రెండు నుంచి ఐదు నిమిషాల మధ్య ఒక రైలు నడిపే వెసులుబాటు ఉంది. మొదటి దశ 2017 లో నాగోల్ – అమీర్ పేట – మియాపూర్ మార్గంలో ప్రారంభించారు. తరువాత ఎల్.బి.నగర్ – అమీర్ పేట 2018 లో, అమీర్ పేట – హైటెక్ సిటీ 2019లో ప్రారంభమైంది. జేబీఎస్ – ఎంజబీఎస్ మార్గంలో రైళ్ల రాకపోకలు 2020 ఫిబ్రవరిలో మొదలయ్యాయి. మొత్తం 69 కిలోమీటర్ల మార్గం 2020లో అందుబాటులోకి వచ్చి ఫేజ్ 1 మొత్తం పూర్తి చేశారు. మెట్రో లో సగటున నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రూ.22వేల కోట్ల వ్యయంతో పీపీపీ భాగస్వామ్యంతో నిర్మిస్తే కేవలం 3 శాతం మంది ప్రయాణీకుల అవసరాలను తీర్చుతున్నది. ఇంకా 71 శాతం మంది వ్యక్తిగత వాహనాలను వాడడం మూలంగా మెట్రో రైలు లాభాల బాటలో పడలేదనేది వాస్తవం.

రెండో దశకు 2022లో శంకుస్థాపన

రాయదుర్గం – ఎయిర్ పోర్టు కారిడార్ విస్తరణ కోసం 2022 డిసెంబర్ 9న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా, 2025 లోగా రూ.6,250 కోట్లతో పూర్తి చేయాలని అనుకున్నారు. దేశంలోనే 2014 సంవత్సరంలో హైదరాబాద్ మెట్రో రైలు నెట్ వర్క్ (దూరం) లో రెండో స్థానంలో ఉండగా, విస్తరణ లేకపోవడం మూలంగా తొమ్మిదో స్థానానికి దిగజారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మెట్రో రైలు విస్తరణకు చర్యలు చేపట్టి రెండు ఫేజుల్లో 163 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఎల్ అండ్ టీ సంస్థతో పలుమార్లు ప్రభుత్వం పెద్దలు చర్చలు జరిపారు. విస్తరణలో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ ని కోరింది. ఫేజ్ 2ఏ, 2బీ విస్తరణలో పాల్గొనడం లేదని, అనేక సమస్యలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై నవంబర్ 2024 నుంచి సందిగ్ధత ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుతో తమకు నష్టం కలిగిందని, ఆ డబ్బులు సమకూర్చితే వైదొలుగుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు ఆడుతున్నారని, మెట్రో రైలు విస్తరణకు అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.