విధాత: దేశ రాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్ (Delhi Railway Station)లో దారుణం చోటుచేసుకున్నది. ఆదివారం ఉదయం రైల్వేస్టేషన్ బయట విద్యుతాఘాతంతో టీచర్ మృత్యువాతపడింది. వర్షం కారణంగా రోడ్డుపై నీరు ఉన్నచోట నుంచి పక్కగా వెళ్లే క్రమంలో టీచర్ ఓ ఎలక్ట్రిక్ పోల్ ను పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ట్యాక్సీ స్టాండ్‌కు సమీపంలోని పహర్‌గంజ్ సైడ్ ఎంట్రీ దగ్గర ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలోని ప్రీత్ విహార్ నివాసి, లక్ష్మీనగర్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సాక్షి అహుజా (34) కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్ విహార యాత్రకు వెళ్లేందుకు వందేభారత్ రైలు ఎక్కేందుకు ఆదివారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సాక్షి పేరేంట్స్ కారును పార్క్ చేసేందుకు వెళ్లారు. ఆమె తన సోదరితోపాటు ఇద్దరు పిల్లలను ఫ్లాట్‌ఫామ్‌కు తీసుకెళ్లే క్రమంలో ముందుగా వారిని పంపించింది.
ఆ తర్వాత ట్యాక్సీ స్టాండ్‌కు సమీపంలో నీరు నిల్వ ఉండగా, ఆ ప్రాంతాన్ని తప్పించుకునే ప్రయత్నంలో సాక్షి అహుజా విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబసభ్యుల ఎదుటే ఈ ఘటన చోటుచేసుకోవడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే స్పందించి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి దవాఖానకు తరలించగా అప్పటికే సాక్షి మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.