Hyderabad | మహిళ స్నానం చేస్తుండగా ఓ యువకుడు రహస్యంగా తన మొబైల్‌లో వీడియో చిత్రీకరించాడు. యువకుడిని గమనించిన బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో శనివారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అమీర్‌పేట చిన్న గురుద్వారా సమీపంలో ఓ మహిళ(31) స్నానం చేస్తుండగా, పక్కనే హాస్టల్‌లో ఉంటున్న కిరణ్(22) అనే యువకుడు గమనించాడు. దీంతో హాస్టల్ టెర్రస్ పై నుంచి కిందకు దిగాడు. మహిళ స్నానం చేస్తున్న బాత్రూం వద్దకు వెళ్లి.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం ద్వారా వీడియో చిత్రీకరించాడు. ఇది గమనించిన బాధిత మహిళ గట్టిగా అరిచింది.
దీంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు. కిరణ్ సెల్‌ఫోన్‌లో ఈ తరహా వీడియోలు చాలా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.