విధాత: మీరు ఆధార్ కార్డు తీసుకొని 10 ఏండ్లు అవుతుందా..? అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆధార్ అప్‌డేట్ చేయలేదా..? మీ వివరాలను మార్చుకోలేదా? అలాంటి వారి కోసం యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు పొంది 10 ఏండ్లు అవుతున్న వారు.. తమ గుర్తింపుతో పాటు, నివాస ధృవీకరణ పత్రాలను అప్‌డేట్ చేయాలని ఆదేశించింది.
ఆన్‌లైన్ ద్వారా లేదా ఆధార్ సేవా కేంద్రాల్లో ఈ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇది తప్పనిసరా కాదా అన్నది స్పష్టంచేయలేదు. దేశంలోని పౌరులందరికీ.. విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ గుర్తింపు కార్డులకు వ్యక్తి యొక్క ఐరిస్, వేలిముద్రలతో పాటు ఫోటోలను ప్రామాణికంగా తీసుకుంటున్నది ప్రభుత్వం. ఇక ఆధార్ కార్డును ప్రభుత్వ పథకాలతో ఇతర అంశాలకు తప్పనిసరి చేశారు. మనం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టామంటే.. ఆధార్ మన వెంట ఉండాల్సిందే. ఎక్కడ చూసినా ఆధార్ అడుగుతున్నారు.
యుఐడీఎఐ అనేది ఒక చట్టబద్ధమైన అథారిటీ, దీనిని భారత ప్రభుత్వం జూలై 12, 2016న ఆధార్ చట్టం, 2016 ప్రకారం స్థాపించింది. ద్వంద్వ, నకిలీ గుర్తింపులను తొలగించడానికి భారతదేశంలోని నివాసితులందరికీ ‘ఆధార్’ అని పిలువబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఏడీ) జారీ చేయాలనే లక్ష్యంతో ఇది స్థాపించబడింది.