గుజ‌రాత్‌: ఆప్‌తో లాభమెవరికి.. నష్టమెవరికి?

ముక్కోణ‌పు పోటీలో గెలుపు ఎవ‌రిని వ‌రించునో.. విధాత‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులకు నేటికి చాలా వ్యత్యాసం ఉన్నది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం ఆప్‌ రంగ ప్రవేశంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రెబల్స్‌ బెడద ఎక్కువ […]

  • Publish Date - November 28, 2022 / 05:12 PM IST
  • ముక్కోణ‌పు పోటీలో గెలుపు ఎవ‌రిని వ‌రించునో..

విధాత‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులకు నేటికి చాలా వ్యత్యాసం ఉన్నది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం ఆప్‌ రంగ ప్రవేశంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది.

రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రెబల్స్‌ బెడద ఎక్కువ అయ్యింది. దాదాపు 20 మంది రెబల్స్‌పైన బీజేపీ వేటు వేసిందంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ పట్టణ ఓటర్లపై నమ్మకం పెట్టుకునే బీజేపీకి గత ఎన్నికల్లో ఆ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టారు. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు ఉన్నప్పటికీ బీజేపీకి పట్టణ వాసులు భారీగా ఓట్లు వేయడంతో 99 గెలువగలిగింది. కానీ ఆప్‌ ఎంట్రీతో పట్టణ ఓటర్లు ఆ పార్టీ వైపు మళ్లవచ్చని, ఫలితంగా కమలం పార్టీకి కొత్త చిక్కులు తెచ్చేలా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

మొన్న మునుగోడులోనూ చౌటుప్పల్‌, చండూర్‌ పట్టణ ఓటర్లపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్నది. నిజానికి ఆ రెండు మండలాల పట్టణ ఓటర్లు గంపగుత్తగా మాకే ఓటు వేస్తారని ఇక తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే వారి ఆలోచనలకు భిన్నంగా ఆ రెండు మండలాల ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు నిలిచారు. కాబట్టి బీజేపీ గెలుపునకు బాసటగా ఉండే పట్టణ ఓటర్లు గడిచిన ఎనిమిదిన్నరేళ్ల కేంద్ర ప్రభుత్వ విధానాలతో మారుతున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.

బీజేపీతో పాటు కాంగ్రెస్‌లోనూ రెబల్స్‌ బెడద ఎక్కువగానే ఉన్నది. అయితే ఆ పార్టీ అధిష్ఠానం కంటే స్థానిక నాయకత్వం కూడా గట్టిగానే ఉన్నదని, అట్లనే 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రూ. లక్ష వరకు విద్యుత్‌ బిల్లులు మాఫీ, మహిళలకు నెలకు రూ. 2 వేల వంటివి ఆపార్టీకి లాభం చేకూర్చవచ్చ‌ని అంటున్నారు. ఆప్‌ పట్టణ ఓటర్లలో చీలిక తెస్తే బీజేపీకి, గ్రామీణ ఓటర్లలో చీలిక తెస్తే కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చవచ్చు. అలాగే గోల్డ్‌, డైమండ్‌ కార్మికులు లక్షలాది మంది బీజేపీపై గుర్రుగా ఉన్నారని, దశాబ్దాలుగా తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా వాళ్లంతా అధికారపార్టీకి వ్యతిరేకంగా నిలబడితే బీజపీ ఓటు బ్యాంకు గండి పడనున్నది.

ఢిల్లీ తరహాలోనే ఉచిత, నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు, వీధి క్లీనిక్‌లు ఆప్‌కు అదనపు బలం. తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలను రద్దు చేసి, పర్మినెంట్‌ చేయడం, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగభృతి వంటి హామీలను ఆప్‌ ఇస్తున్నది. వాటికి ప్రజలు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉన్నదనే ప్రధాని చాలారోజులుగా ఉచితాలపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. అంతేకాదు ఢిల్లీ నుంచి కొంతమంది వస్తారు. మాయ మాటలు చెబుతారు. వాళ్లను విశ్వసించవద్దని, తాను ఇక్కడి వ్యక్తిని అని లోకల్‌ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారు. అయితే ఎనిమిదిన్నరేళ్లుగా ప్రధాని ఉంటున్నా బీజేపీకి ఇప్పటికీ ఆయన ముఖ చిత్రమే ప్రచారంలో ఉండటం గమనార్హం.

అంతేకాదు ఆప్‌ సంధిస్తున్న ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పడం లేదు. టీవీ చర్చల్లోనూ ఆప్‌ నేతలు పాల్గొంటే కాంగ్రెస్‌, ముఖ్యంగా బీజేపీ నేతలు గైర్హాజరు అవుతున్నారు. దీన్నిబట్టి పైకి ఆప్‌ గురించి ఉచ్చరించకున్నా లోలోప ఎంత టెన్షన్‌లో ఉన్నారో ఈ ఉదంతాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అక్కడ ఆప్‌ పంజాబ్‌ వలె అధికారంలోకి వస్తుందని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ ఆ పార్టీ చేస్తున్న ప్రచారం వల్ల బీజేపీకే ఎక్కువ నష్టం చేస్తుందనే వాదన వినిపిస్తున్నది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆప్‌ చిలిస్తే అది మాకు మేలు చేస్తుంది అని బీజేపీ నేతలు అంటున్నా… అంత సీన్‌ లేదంటున్నారు. అందుకే ప్రధాని, కేంద్ర హోం మంత్రి, యూపీ, అస్సాం సీఎంలు అక్కడే మోహరించారు. గుజరాత్‌లో బీజేపీని తిరిగి అధికారంలోకి తేవడం కంటే మోడీ ఇమేజ్‌ను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీజేపీకి ప్రతికూల పరిస్థితులు వస్తే ఆ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందనేది కమలనాథుల కలవరానికి కారణం.