విధాత: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఉత్తర క్యాంపస్‌లో భగత్‌సింగ్ ఛత్రా ఏక్తా మోర్చా నేతృత్వంలో ప్రదర్శన చేపట్టారు. అకారణంగా సాయిబాబాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. అతని అనారోగ్య పరిస్థితుల దీష్ట్యా అతన్ని వెంటనే విడుదల చేయాలని నినదించారు.
ఇది గిట్టని ఏబీవీపీ కార్యకర్తలు బీఎస్‌సీఈఎం ప్రదర్శనను చుట్టిముట్టి వ్యతిరేక నినాదాలు చేస్తూ దాడికి దిగారు. దీంతో బీఎస్‌సీఈఎం కార్యకర్తలు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి చకిత్స అందించేందుకు హాస్పిటల్ కు తరలించగా అక్కడ కూడా వారికి చికిత్స అందకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ ఘటనపై ఇరు వర్గాలూ ఎదుటి పక్షంపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. శాంతియుత ప్రదర్శనపై ఏబీవీపీ వారే అకారణంగా దాడి చేశారని భగత్‌సింగ్ ఛత్రా ఏక్తా మోర్చా ఆరోపించగా, తమ మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించటం కారణంగానే వారిని నిలదీశామని ఏబీవీపీ చెప్పుకొచ్చింది. మోదీ హయాంలో మతోన్మాద శక్తుల ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తల దాడులు పెచ్చరిల్లుతున్నాయని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తున్నారు