Elections |
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ప్రజల్లో వ్యతిరేకత ప్రబలక ముందే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల దండోరా మోగిస్తుందా? ఐక్యత కోసం విపక్షాలు చేస్తున్న కృషి ఫలించకుండానే వాటిని బలవంతంగా ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉన్నదా? మోదీ తన చిరకాల కోరిక అయిన జమిలి ఎన్నికలను పాక్షిక స్థాయిలోనైనా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారా? జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. సాక్షాత్తూ బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సైతం దేశంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని చెప్పిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
విధాత: లోక్‌సభకు ముందే ఎన్నికలు వస్తాయన్న చర్చ ఊపందుకుంటున్నది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఈ మేరకు అంచనాలు వేయగా.. పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అదే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నితీశ్‌కుమార్ కూడా మోదీ స్థాయి నాయకుడేనని, గతంలో ఎన్డీయేలో భాగస్వామిగా కూడా ఉన్నారు. మోదీ రాజకీయ ఎత్తుగడల విషయంలో ఆయన అవగాహనను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదని, కావాలనుకుంటే లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరుపుకోవచ్చునని నితీశ్‌కుమార్ చెప్పారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన నితీశ్‌కుమార్.. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టాని ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ముందస్తు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీనిపై శుక్రవారం మరోసారి విలేకరులు ప్రశ్నించగా.. అదే సమాధానం చెప్పారు.
ప్రస్తుతం దేశంలో విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు విశేష కృషి జరుగుతున్నది. ప్రత్యేకించి బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కంకణం కట్టుకుని మరీ ఐక్యతా యత్నాల్లో నిమగ్నమయ్యారు. ఆయన కృషి ఫలించి.. కాంగ్రెస్‌తోపాటు పలు ప్రాంతీయ పార్టీలు అవగాహనకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే మోదీ ప్రభుత్వ విధానాలపై బుద్ధిజీవులు తీవ్ర ఆందోళన, భయాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశం రానురాను నిరంకుశ ధోరణిలోకి దిగజారిపోతున్నదని కూడా అంటున్నారు. ఇది క్రమంగా ప్రజల్లోకి కూడా వెళుతున్నది. ఒకవైపు ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలు, మరోవైపు ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న ఆగ్రహం తోడైతే మోదీ ప్రభుత్వానికి కష్టకాలం తప్పదు. అందుకే మోదీ ముందస్తు ఆలోచన చేస్తారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
రాష్ట్రాలకు విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అదే లోక్‌సభ ఎన్నికల సమయంలో కొంత తేడా ఉంటుంది. తెలంగాణే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. ఆ విషయం అసెంబ్లీ ఎన్నికల్లో తేటతెల్లమైంది. కానీ.. లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాల్లో బీజేపీ గెలిచింది. అదే రెండు ఎన్నికలు కలిపి నిర్వహిస్తే.. కలిసి వస్తుందనే అభిప్రాయం బీజేపీ పెద్దల్లో ఉన్నదని అంటున్నారు. అందుకోసమే ఐదు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే డిసెంబర్‌లోనే ముందస్తుకు వెళ్లొచ్చన్న చర్చ జరుగుతున్నది.
పాక్షిక జమిలి?
జమిలి ఎన్నికల కోసం మోదీ కలకంటున్నారు. రాష్ట్రాలకు విడిగా ఎన్నికలు జరిగినప్పుడు తేడాలు ఉంటున్న కారణంగా అది రాజ్యసభపై ప్రభావం చూపుతున్నది. ఇప్పటికీ రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయంతోనే ఆయన జమిలి పాట పాడుతున్నారనే వాదన ఉన్నది. ఇప్పుడు ఆ కలను కనీసం పాక్షికంగానైనా నెరవేర్చుకునేందుకు మోదీ ప్రయత్నించవచ్చని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లో నిర్వహిస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే సమయంలో ఉంటాయి.
మరోవైపు 2014 ఏప్రిల్‌లో ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇందులో ఏపీ సీఎం జగన్.. కేంద్రం ఏది చెబితే దానికి ‘ఎస్ బాస్’ అంటారని, ముందుస్తుకు వెళ్లాలని కోరినా సిద్ధపడతారని అంటున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీయే అధికారంలో ఉన్నది. అక్కడా ముందస్తు నిర్వహణకు ఇబ్బంది లేదు. సిక్కింలోనూ ఎన్డీయే భాగస్వామ్య పక్షమే అధికారంలో ఉన్నది. ఇక మిగిలింది ఒడిశా. ఇక్కడి సీఎం నవీన్ పట్నాయక్ ప్రతిపక్ష కూటమిలో లేరు. అలాగని ఎన్డీఏ పక్షాన కూడా లేరు. ఏదో ఒకటి చేసి ఒడిశాలో కూడా ముందస్తుకు కేంద్రం ప్రయత్నించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
విపక్షాల ఐక్యతపై బీజేపీలో ఆందోళన
దేశంలో విపక్షాలకు ప్రజాదరణ పెరుగుతున్న అంశం మోదీ ప్రభుత్వానికి అర్థమవుతున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక ఫలితాలతో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చిందని అంటున్నారు. ఎన్నికలు ఆలస్యం చేసే కొద్దీ తమకు వ్యతిరేకత పెరుగుతుందని, తద్వారా మరిన్ని సీట్లు కోల్పోవడం గ్యారంటీ అనే ఆందోళన బీజేపీ నాయకత్వంలో కనిపిస్తున్నదని, దీంతో ముందస్తుకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే.. బీజేపీ నేతలుకానీ, ఎన్డీఏ పక్ష నేతలు కానీ ఈ విషయంలో బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు.
కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మోదీ ఏ నిముషంలోనైనా ముందస్తుకు ముహూర్తం పెట్టవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కీలకమైన నిర్ణయాలన్నింటినీ మోదీ ఆకస్మికంగానే తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. ‘నోట్ల రద్దు నిర్ణయం కానీయండి.. పాకిస్థాన్ మూకలపై సర్జికల్ స్ట్రైక్స్ కానీయండి… ఇప్పుడు ఉన్నట్టుండి 2 వేల నోటును ఉపసంహరించడం చూడండి. మోదీ అన్నీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాలే. ఈ సంఘటనల దృష్ట్యా ముందస్తు ఎన్నికలు కూడా ప్రకటించరని గ్యారేంటీ ఏముంది?’ ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
పాట్నా సదస్సులో ముందస్తుపై చర్చ!
జూన్ 2౩న జరిగే పాట్నాలో ప్రతిపక్షాల సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు కాంగ్రెస్, వామపక్షాలు సహా 18 పార్టీల నాయకులు హాజరుకాబోతున్నారు. మోదీ విద్వేష పాలనకు వ్యతిరేకంగా అక్కడి నుంచి సమరశంఖం పూరిస్తామని విపక్ష నేతలు చెబుతున్నారు. ఇదే సదస్సులో ముందస్తు ఎన్నికలపైనా చర్చ జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఈ సదస్సుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరు కావటం లేదని సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తామంటున్న బీఆర్‌ఎస్.. సొంతంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ శిబిరంలో చేరేందుకు ఇప్పటి వరకూ ఎవరూ ఆసక్తి చూపలేదు.