అఫ్గాన్ యువ‌త పెళ్లిళ్ల‌కు అడ్డుగా పేద‌రికం.. ప్ర‌త్యామ్నాయంగా ఏం చేస్తున్నారంటే…

పేద‌రికం, రాజ‌కీయ అస్థిర‌త‌తో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్ర‌జ‌ల‌కు పెళ్లిళ్లు చేసుకోవ‌డ‌మూ క‌ష్టంగా మారింది

  • Publish Date - December 26, 2023 / 10:59 AM IST

విధాత‌: పేద‌రికం, రాజ‌కీయ అస్థిర‌త‌తో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ (Afghanistan) ప్ర‌జ‌ల‌కు పెళ్లిళ్లు చేసుకోవ‌డ‌మూ క‌ష్టంగా మారింది. బంధువుల‌ను పిలుచుకుని వేడుక‌గా చేసుకోవ‌డం త‌ల‌కు మించిన భారం కావ‌డంతో వారంతా కొత్త ప్ర‌త్యామ్న‌యాన్ని వెతుక్కున్నారు. సామూహికంగా జంట‌ల‌న్నీ (Mass Marriage Ceremony) క‌లిసి ఖ‌ర్చుల‌న్నీ పంచుకుంటూ పెళ్లి కానిచ్చేస్తున్నారు.


సోమ‌వారం కాబుల్‌లో జ‌రిగిన ఓ వేడుక‌లో 50 జంట‌లు ఇలా షాదీ చేసుకుని ఒక్క‌ట‌య్యాయి. ఇలా సామూహిక వివాహాల‌ను చేసుకోవ‌డం.. ఖ‌ర్చుకు భ‌య‌ప‌డేన‌ని వారంతా పేర్కొన్నారు. న‌గ‌రంలోకి ఒక స‌మావేశ మందిరంలో ఏమాత్రం హ‌డావుడి లేకుండా ఈ సామూహిక వివాహ క్ర‌తువు జ‌రిగింది. హడావుడి లేక‌పోవ‌డానికి డ‌బ్బు ఒక స‌మ‌స్య కాగా తాలిబ‌న్ పాల‌కులు మ్యూజిక్‌, డ్యాన్స్‌ను నిషేధించ‌డంతో వాటి ఉనికే పెళ్లిళ్ల‌లో లేకుండా పోయింది.


కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న సిటీ స్టార్ వెడ్డింగ్ హాల్‌లో ఈ వివాహం జ‌ర‌గ‌గా.. అనంత‌రం అందంగా అలంక‌రించిన కార్లలో నూత‌న వ‌ధూవ‌రులు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు. ‘సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకోవాలంటే 2,00,000 నుంచి 2,50,000 అఫ్గానీలు ఖ‌ర్చ‌వుతాయి. ఈ సామూహిక వివాహాల్లో మాకు 10,000 అఫ్గానీలు మాత్ర‌మే ఖ‌ర్చ‌యింది’ అని రూహుల్లా రెజాయీ అనే పెళ్లి కొడుకు వివ‌రించారు. త‌మ పెళ్లికి సాధారణంగా 500 మంది మాత్ర‌మే వ‌స్తార‌ని .. ఇప్పుడు మాత్రం ఇరువైపులా క‌లిపి 35 మందిని మాత్ర‌మే ఆహ్వానించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.


ఇక్క‌డ పెళ్లి చేసుకునే వారికి ఒక కేక్‌, కార్పెట్‌, బ్లాంకెట్‌, టూత్ పేస్ట్‌, షాంపూ, మాయిశ్చ‌రైజ‌ర్ వంటి కొన్ని నిత్యావ‌స‌ర వ‌స్తువులనూ బ‌హుమ‌తిగా నిర్వాహ‌కులు ఇస్తారు. ఈ వివాహాల‌కు తాలిబ‌న్ ప్ర‌తినిధి ఒక‌రు వ‌చ్చి ఖురాన్ నుంచి వాక్యాల‌ను చ‌దివి వినిపిస్తారు. కార్య‌క్ర‌మంలో పెళ్లి కొడుకుల‌తో మాట్లాడ‌టానికి అవ‌కాశం ఉంటుంది కానీ పెళ్లి కుమార్తెల‌తో మాట్లాడ‌టానికి మీడియాకు అవ‌కాశ‌మే ఉండ‌దు. వారిని క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌కుండా లోప‌ల ఎక్క‌డో కూర్చోబెడ‌తారు.


‘నా ప్రియురాలితో వివాహం కోసం నేను మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను. అది ఈ రోజు నెర‌వేరింది. త‌న‌ను చూడ‌టానికి ఇక నేను వేచి ఉండ‌లేను’ అని ఓ యువ‌కుడు చెప్పుకొచ్చాడు. వివాహాలు జ‌ర‌గ‌క‌పోతే యువ‌కుల‌లో అశాంతి రేగుతంద‌ని భావించిన తాలిబ‌న్ ప్ర‌భుత్వం.. ఈ సామూహిక వివాహాల‌కు అనుమ‌తిచ్చిన‌ట్లు స‌మాచారం.

Latest News