- ఎన్నికలపై గట్టి ప్రభావం చూపే అవకాశం
- బెంగళూరులో పోటా పోటీ నిరసన ప్రదర్శనలు
- అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధాలు
- రాజకీయ పర్యవసనాలుంటాయన్న నిపుణులు
- అమూల్‌తో విలీనానికి అమిత్‌షా ప్రతిపాదన
- కర్ణాటకకు వస్తామన్న అమూల్.. వివాదం మొదలు
ప్రభుత్వం అమూల్‌ను అనుమతించిన తర్వాత నందిని బ్రాండ్ దానంతట అదే నాశనమయ్యేలా చూస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నందిని పాలు, పాల ఉత్పత్తులకు కృత్రిమ కొరత సృష్టించి, అమూల్ పాలను అలవాటు చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలు నష్టాలపాలయ్యేలా చూసి.. అనంతరం వాటిని విలీనం చేయడమో, వేరొకరి చేతిలోనో పెట్టడం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అలవాటేనని, నందిని బ్రాండ్ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. అందుకే కర్ణాటకలో అమూల్-నందిని బ్రాండ్ల మధ్య యుద్ధం.. రాజకీయ యుద్ధంగా మారింది.
విధాత: వేసవికి దీటుగా వేడిని పుట్టిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో తాజాగా పాల వివాదం సెగలు రేపుతున్నది. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) తాను కర్ణాటక మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్టు చేసిన ప్రకటన.. వివాదానికి దారి తీసింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బ్రాండ్ నందిని పాలు కర్ణాటకలో ఫేమస్. గుజరాత్ ఫెడరేషన్ బ్రాండ్ అమూల్. అయితే.. అనేక మంది రాజకీయ నాయకులు, బెంగళూరు ప్రజలు జీసీఎంఎంఎఫ్ ప్రకటనను ఖండించారు.
నందిని బ్రాండ్‌కే తమ మద్దతు అని తేల్చి చెప్పారు. ‘సేవ్ నందిని’, ‘గో బ్యాక్ అమూల్’ అనే నినాదాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో (Amul vs Nandini) వ్యాపార యుద్ధం కాస్తా.. రాజకీయ యుద్ధంగా కూడా మారిపోయింది. ఇది తమ ఇంటి బ్రాండ్‌పై, కన్నడిగ ఆత్మగౌరవంపై, ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కార్పొరేట్ దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.
కర్ణాటక బ్రాండ్‌ను చంపడమేనన్న కాంగ్రెస్
దక్షిణాది రాష్ట్రాల్లో ‘మాది’ అనుకునేదాని పట్ల ప్రజల మమకారం ఎంతో ఉంటుంది. అది ఆహార పదార్థమైనా, ఆహార్యమైనా, లేక భాష అయినా.. మార్చి ఆఖరు వారంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) అన్ని రాష్ట్రాలు పెరుగు ప్యాకెట్లపై ‘దహి’ అని హిందీలో రాసి.. కింద వారి స్థానిక భాషల్లో రాసుకోవాలని సూచించినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇది ఉత్తరాది భాష అయిన హిందీని తమపై బలవంతంగా రుద్దడమేనని పలువురు మండిపడ్డారు. ఇప్పుడు అమూల్ వివాదం వచ్చింది.
రాష్ట్రంలోకి అమూల్ బ్రాండ్‌ను అనుమతించడం అంటే.. స్థానిక నందిని బ్రాండ్‌ను హత్య చేయడమేనని కాంగ్రెస్ మండిపడుతున్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి కాంగ్రెస్ నాయకులే కాకుండా.. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సైతం అమూల్ రాకను సామాజిక మాధ్యమాల్లో నిరసించారు. ‘ఒకే దేశం.. ఒకే అమూల్, ఒకే పాలు, ఒకే గుజరాత్’ అనేది కేంద్ర ప్రభుత్వ అధికార వైఖరిగా మారిపోయిందని కుమారస్వామి విమర్శించారు. ‘ఇప్పటికే మనకు అమూల్ కంటే ఉత్తమమైన నందిని బ్రాండ్ ఉన్నది. మనకు అమూల్ అక్కర్లేదు. మన నీళ్లు.. మన పాలు.. మన గడ్డ ఎంతో బలీయమైనవి’ అని డీకే శివకుమార్ చెప్పారు.
రాజకీయం చేసేందుకేనన్న బీజేపీ
అయితే.. ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అమూల్ కంటే నందిని పాల ధర తక్కువ కాబట్టి సమస్య లేదని, గుజరాత్ బ్రాండ్ కర్ణాటక బ్రాండ్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయలేదని ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ అంటున్నారు.
ఎన్నికలపై ప్రభావం?
అమూల్-నందిని వివాదం రాజకీయంగా ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇది ఓటర్ల మధ్య చీలిక తెచ్చే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఎందుకంటే.. నందిని బ్రాండ్‌ను ఇంటి బ్రాండ్‌గా స్థానికులు భావిస్తారు. అది తమ గర్వకారణంగా కూడా చెబుతుంటారు.
కేఎంఎఫ్ 1974లో స్థాపించారు. దేశంలో అమూల్ తర్వాత రెండో అతిపెద్ద పాల సేకరణదారుగా ఉన్నది. పునీత్ రాజ్‌కుమార్ తాను చనిపోవడానికి ముందు నందినికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. దీనికోసం ఆయన ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయలేదంటే కర్ణాటకలో నందిని పాలకు ఉన్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.
చాలామంది పాల ఉత్పత్తిదారులు పాత మైసూరు ప్రాంతానికి చెందినవారే. వారిలో అత్యధికులు వక్కలిగ వారే. వీరంతా జేడీఎస్, కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులు కావడం గమనార్హం. బీజేపీకి బాగా పట్టున్నప్రాంతం మధ్య కర్ణాటక. ఇక్కడ లింగాయత్‌లదే ఆధిపత్యం. అందుకే ఈ అంశాన్ని చిన్నదిగా చేసి చూపేందుకు, ఓటర్లలో ఎలాంటి భయాలు లేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
విలీనం ప్రతిపాదన తెచ్చిన అమిత్‌షా
నిజానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ను అమూల్‌తో విలీనం చేయాలన్న ప్రతిపాదన గురించి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తొలుత మాట్లాడారు. ఈ రెండు బ్రాండ్లు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. అమిత్‌షా వ్యాఖ్యల నేపథ్యంలో.. తాము కర్ణాటకలో ప్రవేశిస్తామని అమూల్ ప్రకటించింది. అమిత్‌షా ఆ ప్రతిపాదన చేసినప్పుడే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల తర్వాత విలీనం?
ఎన్నికల తర్వాత అమూల్ బ్రాండ్‌తో నందిని బ్రాండ్‌ను విలీనం చేస్తారన్న భయం కన్నడిగుల్లో ఉన్నది. తమ గుర్తింపును నీరుగార్చే ప్రయత్నంగా కన్నడిగులు భావించబట్టే.. అమూల్‌కు వ్యతిరేకంగా ఇంతటి స్థాయిలో స్పందించారు. బెంగళూరు నగరంలో 24వేలకు పైగా చిన్న, పెద్ద హోటళ్ల సంఘమైన ది బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కూడా నందిని బ్రాండ్‌కే మద్దతు పలికింది.
ఈ హోటళ్లు.. రోజుకు నాలుగు లక్షల లీటర్ల నందిని బ్రాండ్ పాలు, 50వేల లీటర్ల పెరుగును వినియోగిస్తుంటాయి. అంతేకాదు.. నెయ్యి, బటర్, కోవా, పనీర్, చీజ్ వంటి పాల ఉత్పత్తులను సైతం కొనుగోలు చేస్తుంటాయి. భవిష్యత్తులోనూ తాము నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని అసోసియేషన్ తేల్చి చెప్పింది. కేవలం ధర తక్కువని మాత్రమే కాదు.. కర్ణాటక పాడి రైతులను ఆదుకోవడమే తమ ఉద్దేశమని అసోసియేషన్ నేతలు అంటున్నారు.
నందిని పాలను తాగుతోంది.. బెంగళూర్!
ప్రస్తుతం బెంగళూరు నగర పాల అవసరాల్లో 70శాతం సరఫరా నందిని బ్రాండ్ ద్వారానే. నందిని ఆరెంజ్ మిల్క్ లీటర్ రూ.43 మాత్రమే. సాధారణ పాలు 39కే లభిస్తాయి. దేశంలో అతి తక్కువ ధర ఇదే. అమూల్ ధర లీటర్ రూ.54పైనే. ప్రస్తుతానికి అమూల్ పాలు కర్ణాటకలో ఈకామర్స్, ఆన్‌లైన్ సేల్‌లో మాత్రమే లభ్యమవుతున్నాయి.
ప్రభుత్వం అమూల్‌ను అనుమతించిన తర్వాత నందిని బ్రాండ్ దానంతట అదే నాశనమయ్యేలా చూస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నందిని పాలు, పాల ఉత్పత్తులకు కృత్రిమ కొరత సృష్టించి, అమూల్ పాలను అలవాటు చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలు నష్టాలపాలయ్యేలా చూసి.. అనంతరం వాటిని విలీనం చేయడమో, వేరొకరి చేతిలోనో పెట్టడం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అలవాటేనని, నందిని బ్రాండ్ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు.