Site icon vidhaatha

Komatireddy | హయత్‌నగర్ వరకు మెట్రో పొడిగించండి.. CM KCRకు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

Komatireddy

విధాత: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు పొడిగించాలని కోరుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇటీవల తొలి లేఖలో డిఎస్సీ నోటిఫిషన్ విడుదల చేయాలని, రెండో లేఖలో రైతుబంధు వానాకాలం సీజన్ పెండింగ్ డబ్బులను రైతులకు అందించాలని కోరారు. మూడో లేఖలో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైల్వై లైన్ పొడగించాలని కోరారు.

హైదరాబాద్‌ నగరం హయత్ నగర్‌, నల్లగొండ మార్గంలో వేగంగా విస్తరిస్తోందని, నిత్యం వేలాది మంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి, అక్కడి నుంచి మెట్రోకు వెళుతున్నారని, ఇందుకు వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా హయత్ నగర్ వరకు మెట్రో పొడగించాలని కోరారు.

హైద్రాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా కేంద్రం మారుస్తుందని, రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతుందని, అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంటుందన్నారు. మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉందన్నారు.

ఈ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందని, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హరిదీప్‌ పురికి గతంలో లేఖ రాయగా, దీనిపై ఆయన స్పందించి రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వార్డ్ చేశారని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్‌కు మెట్రో పొడగింపు చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version