Site icon vidhaatha

జగన్‌కు మళ్లీ జెల్ల.. అనూహ్యంగా TDP అనురాధ గెలుపు | క్రాస్ ఓటింగ్ చేసిన YCP ఎమ్మెల్యేలు

విధాత‌: మొన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో మూడు సీట్లూ కోల్పోయి పరాభవంతో ఉన్న వైసీపీకి మరో దెబ్బ తగిలింది. కాసేపటిక్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకోకుండా టిడిపి అభ్యర్థి అనూరాధ గెలవడం వైసీపీకి మింగుడు పడడం లేదు. మొత్తం ఏడు సీట్లకుగాను ఆరు సీట్లు వైసీపీకి దక్కగా ఒకటి టిడిపికి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు తెలివి.. వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను బరిలోకి దించగా ఆయన ఊహించినట్టుగానే ఆమె గెలుపొందారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చంద్రబాబు భావించగా అదే నిజమైంది.

టీడీపీకి అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అయితే.. టీడీపీ నుంచి 2019లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు.. వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీతో పయనిస్తున్నారు. దీంతో టిడిపిలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

ఇదే తరుణంలో వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి పార్టీ మీద గుర్రుగా ఉంటూ టిడిపికి దగ్గరయ్యరు. అలాగే రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తమను మంత్రి పదవుల నుంచి తప్పించడంపై మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వారిపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుకున్నట్టే క్రాస్ ఓటింగ్ జరగడంతో ఏ మాత్రం గెలుపు అంచనాలు లేని స్థితి నుంచి అనురాధ విజయబావుటా ఎగురవేశారు.

మొత్తానికి చంద్రబాబు దెబ్బకు జగన్ నిలవలేకపోయారు. దీంతో వైసిపి నుంచి నిలబడిన ఆరుగురిలో మొన్ననే టిడిపి నుంచి చేరిన కైక్షలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగల వెంకటరమణ ఓటమి పాలయ్యారు. వైసిపి ఎంత పక్కాగా ప్లాన్ చేసినా తమవాళ్లను కాపాడుకోలేకపోయారు. దీంతో అనవసరంగా పరాభవం మూటగట్టుకోవల్సి వచ్చింది.

Exit mobile version