Site icon vidhaatha

Asian Games | ఆసియా క్రీడలకు గురుకుల విద్యార్థిని ఎంపిక

Asian Games

విధాత, కరీంనగర్ బ్యూరో: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల విద్యార్థిని ఎంపిక అయ్యింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మమత గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో రాణిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో మమత గుగులోత్‌కు చోటు దక్కింది. సాఫ్ట్‌బాల్ స్క్వాడ్‌లో మమత ఎంపికైంది.

అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 వయో విభాగాల్లో కలిపి మొత్తం 18 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె పలుమార్లు ‘ఉత్తమ క్యాచర్‌’గా అవార్డులు అందుకున్నది. మమత ప్రస్తుతం భువనగిరిలోని సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆసియా చాంపియన్‌ షిప్‌లో భారత జట్టు రెగ్యులర్‌గా పోటీ పడుతుండటంతో ఆసియా సాఫ్ట్‌బాల్‌ సంఘం భారత జట్టుకు వైల్డ్‌ కార్డు ఎంట్రీ కేటాయించింది.

ఆసియా క్రీడల్లో తొలిసారిగా గురుకుల విద్యార్థిని మమత ఎంపిక కావడం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడాల్లో విజయం సాధించి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల ప్రతిభను చాటి చెప్పాలని మమతను అభినందనలు తెలిపారు. మమత ఆసియా క్రీడలకు వెళ్ళేవిధంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, కోచ్ లకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version