విధాత: మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ సైనికుడు ఒకడు మంగళవారం రాత్రి సహచరులపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆర్మీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాల్పుల అనంతరం నిందితుడైన జవాన్ తనను తాను కాల్చుకున్నాడని తెలిపారు. ఈ మేరకు అస్సాం రైఫిల్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
“దక్షిణ మణిపూర్‌లోని ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో అస్సాం రైఫిల్స్ బెటాలియన్ మోహరించింది. అస్సాం రైఫిల్స్ జవాన్ ఒకడు తన సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు (గాయపడిన వారందరూ మణిపురియేతరులు). తరువాత వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు. క్షతగాత్రులందరినీ చికిత్స కోసం మిలిటరీ దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నది” అని ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలకు ఈ ప్రత్యేక ఘటనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఎవరూ మణిపూర్‌కు చెందినవారు కానందున, రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణలతో తాజా ఘటనకు సంబంధం లేదని తెలిపారు. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.
“దేశంలోని వివిధ వర్గాలకు చెందినవారితో అస్సాం రైఫిల్స్ బెటాలియన్లు ఏర్పాటుచేశాం. మణిపూర్‌లో శాంతి భద్రతలు, సుస్థిరతను కాపాడేందుకు సమాజం ప్రశాంతంగా జీవనం సాగించేందుకు సిబ్బంది అందరూ కలిసి ఉంటూ పని చేస్తున్నారు” అని తెలిపారు. సహచరులపై కాల్పులకు తెగబడిన సైనికుడు చురచంద్‌పూర్‌కు చెందినవాడు. ఇటీవలే డ్యూటీలో చేరాడు.