Site icon vidhaatha

మంగ్లీ కారుపై బెంగళూరులో దాడి

విధాత: వర్దమాన గాయని మంగ్లీ కారుపై బెంగళూరులో దాడి జరిగింది. కొందరు యువకులు రాళ్లు రువ్వడంతో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. బళ్లారిలోని మున్సిపల్‌ కాలేజీ మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్‌ కార్యక్రమంలో మంగ్లీ పాటలు పాడారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మంగ్లీని చూడటానికి ఎగబడిన కొందరు యువకులు వేదిక వెనుక ఉన్న మేకప్‌ టెంట్‌లోకి దూసుకుపోయారు.

దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి వారిని చెదరగొట్టారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా.. ఆమె కారుపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఇదే వేడుకకు పునీత్‌ రాజ్‌కుమార్‌ భార్య అశ్విని, అలాగే సీనియర్‌ నటుడు రాఘవేంద్రకుమార్‌తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. సింగర్‌ మంగ్లీతో పాటు కన్నడకు చెందిన మరికొంత మంది గాయకులు కూడా ఆ వేడుకలో పాటలు పాడారు. అయితే ఈ ఘటనపై మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కొద్దిరోజుల క్రితం చిక్కబళ్లాపుర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో యాంకర్ అనుశ్రీ మంగ్లీని వేదిక మీదకు పిలవ‌గా. అందరికీ నమస్కారం అంటూ మంగ్లీ తెలుగులో మాట్లాడింది. అయితే ఇక్క‌డ చాలామంది కన్నడ వారు ఉన్నారు.. కన్నడలోనే మాట్లాడండని యాంక‌ర్ కోర‌గా పక్కనే అనంతపురం ఉంది.. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ జ‌వాబిచ్చింది.

మరోసారి బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. యాంక‌ర్‌ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు తనకు అర్థం కావడం లేదని అన‌డం అక్క‌డి వారిని ఆగ్ర‌హానికి గురి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మంగ్లీ మాట‌ల‌పై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

మంగ్లీని కన్నడలో మాట్లాడాలని అక్కడ ప్రముఖ యాంకర్‌ సూచించారట. అయితే రెండుమూడు మాటలు మాట్లాడిన అనంతరం అందరికీ తెలుగు వస్తుంది కదా అని తెలుగులోనే మాట్లాడంతో అక్కడ కొంత మంది అసంతృప్తితోనే ఈ రాళ్ల దాడికి పాల్పడినట్టు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతున్నది. మంగ్లీ కారుపై దాడి జరిగింది మాత్రం వాస్తవం. అయితే ఇది ఎందుకు జరిగింది అన్నది అధికారికంగా తెలియాల్సి ఉన్నది.

ఖండించిన మంగ్లీ

అయితే తన కారుపై దాడి జరిగినట్టు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై సింగర్‌ మంగ్లీ స్పందించింది. తన కరుపై ఎటువంటి దాడి జరుటలేదని, నేను పాల్గొన్న కార్యక్రమం విజయవంతం అయిందని కన్నడ ప్రజలు నన్ను బాగా రిసీవ్‌ చేసుకున్నారని నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారని వాపోయింది.ఆ వార్తలను నమ్మొద్దని వేడుకుంది.

Exit mobile version