Autism | Adhara Perez
విధాత, సినిమా: ఒకప్పుడు ఆటిజంతో ఇబ్బందిపడి ఇప్పుడు శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ కన్నా ఎక్కువ ఐక్యూను కలిగిన ఓ మెక్సికో బాల మేధావి స్ఫూర్తి గాథ ఇది. మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ కు మూడేళ్లు ఉన్నప్పుడు ఆటిజం(Autism) ఉన్నట్లు బయటపడింది.
అప్పటి నుంచి తోటి పిల్లలు, సమాజం నుంచి హేళనను, సూటిపోటి మాటలను ఎదుర్కొనేది. తమ బిడ్డ బాధ పడటం చూసి ఆమె తల్లిదండ్రులు ఏడాదిలోనే మూడు సార్లు స్కూల్‌ను మార్చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అప్పట్లో ఆటిజం పట్ల అవగాహన లేకపోవడంతో తన టీచర్ల నుంచి సానుభూతి కూడా వచ్చేది కాదని ‘మీ అమ్మాయి ఎసైన్‌మెంట్ పూర్తి చేయాలని ప్రార్థన చేసుకోవాలి’ అంటూ వేళాకోళం చేసేవారని బాలిక తల్లి వెల్లడించారు.
Conoce a Adhara Pérez, una niña mexicana con un coeficiente intelectual más alto que el de Einstein y Hawking pic.twitter.com/zqMoTX7BC6
— NMás (@nmas) September 2, 2020
‘తను అందరి నుంచీ దూరంగా ఉండేది. తోటి పిల్లలతో ఆడుకునేది కాదు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే చదువులో మాత్రం తను కష్టపడిందని, తనతో కూర్చుని ప్రత్యేక పద్ధతుల్లో సైన్సు, మ్యాథ్స్ సూత్రాలను గుర్తించుకునేలా చేసేవాళ్లమని తెలిపారు. అవన్నీ మంచి ఫలితాలనే తీసుకొచ్చాయి.
11 ఏళ్లకే ఇంజినీర్
అధారా ఎడ్యుకేషన్ రికార్డుల ప్రకారం.. తను 5 ఏళ్లకే ప్రాథమిక విద్యను, ఆరేళ్లకే మిడిల్ స్కూలింగ్‌ను పూర్తి చేసింది. 11 ఏళ్లకే అతి కష్టమైన సిస్టం ఇంజినీరింగ్‌లో సీఎన్‌సీఐ యూనివర్సిటీ నుంచి డిగ్రీ సాధించింది. ప్రస్తుతం తను టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికోలో గణితంపై మాస్టర్స్ చేస్తోంది.
అదే సమయంలో మెక్సికన్ స్పేస్ ఏజెన్సీలో పని చేస్తున్న 17 ఏళ్ల అధారాకు నాసాలో వ్యోమగామిగా ఉండాలని కోరిక. అందుకు సంబంధించిన పరీక్షలను సైతం పూర్తిచేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి ఆటిస్టిక్ (ఆటిజం ఉన్న వ్యక్తి) తనే అవుతుంది. పిల్లలకు ఆటిజం ఉంటే ఇక బతుకు భారమేనని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇది ఒక స్ఫూర్తినిచ్చే గాథ.