వాళ్లంతా.. తిరిగి రావాలని బాబు కోరుతున్నది అందుకేనా?

విధాత‌: ఖమ్మం గుమ్మం నుంచే టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని, 30 ఏళ్ల ముందుచూపుతో భవిష్యత్తును నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ ప్రేరణతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఘన చరిత్ర కలిగిన టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సభ నాంది పలుకుతుందని నారా వారు చెప్పుకొచ్చారు. […]

  • Publish Date - December 22, 2022 / 11:12 AM IST

విధాత‌: ఖమ్మం గుమ్మం నుంచే టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని, 30 ఏళ్ల ముందుచూపుతో భవిష్యత్తును నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఖమ్మం సభ ప్రేరణతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఘన చరిత్ర కలిగిన టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఈ సభ నాంది పలుకుతుందని నారా వారు చెప్పుకొచ్చారు. సభలో ఎప్పటిలాగానే బాబు సొంత డబ్బా కొట్టుకున్నారు.

అయితే ఈ సభలోనే బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసే ఉండాలనేది మా పార్టీ అభిమతమన్నారు. నాడు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలే విభజనను కోరుకున్నాయి. మేము ఏపీ, తెలంగాణ కలిసే ఉండాలని కోరుకున్నామని, రాష్ట్రాలను తిరిగి కలపడానికి ఏ అవకాశం ఉన్నా దానికి ఓటేస్తామన్నారు.

దీనికి నిన్న ఖమ్మం సభలో చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపేయాలని కొందరు బుద్ధిలేని వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ రెండు రాష్ట్రాలు ఎప్పటికీ కలిసే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఆ పార్టీ మనుగడ సాగించాలంటే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని అంగీకరించాలి. అప్పుడే ప్రజల ఆదరణ ఉంటుందని బాబుకు తెలుసు. అందుకే ఆయన ఆ అంశాన్ని తీసుకుని వైసీపీకి కౌంటర్‌ ఇచ్చి తెలంగాణపై తమ పార్టీ వైఖరిపై క్లారిటీ ఇచ్చారు.

విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసి హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌లో కలిపి 15 స్థానాల వరకు గెలుచుకున్నది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో చాలామంది నేతలు టీఆర్‌ఎస్‌లోకి, కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేయగా 7.2 లక్షల ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు గెలుచుకున్నది. అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగానే మారింది. ఏపీ మూలాలు ఉన్న ఆ పార్టీ తెలంగాణ‌లో బలహీనపడుతూ వచ్చింది.

అయితే తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి, ఆయన అనుచరులపై కాంగ్రెస్‌ నేతలు పార్టీ పదవుల విషయంలో విమర్శలు చేశారు. ఆ చిచ్చు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే వివిధ కారణాలతో టీడీపీని విడిచి వెళ్లిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లోకి వెళ్లి అక్కడ ఉన్న అసంతృప్త నేతలంతా తిరిగి టీడీపీలోకి రావాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దడానికి ఆ పార్టీ అధిష్ఠానం దిగ్విజయ్‌సింగ్‌ను పంపింది. ఆయన అందరితో మాట్లాడుతున్నారు. ఒకవేళ రేవంత్‌ వర్గంపై విమర్శలు చేసిన సీనియర్ నేతల ఒత్తిడి తలొగ్గితే ఇక వాళ్లంతా ఆ పార్టీలో కొనసాగినా ప్రయోజనం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీకి పూర్వ వైభవం కోరుకుంటున్నబాబు దీన్నితనకు అవకాశంగా వాడుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా మాదిరిగానే వివిధ జిల్లాలతో పాటు నిజామాబాద్‌ సభ నిర్వహిస్తామన్నారు. చివరగా హైదరాబాద్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేస్తామన్నారు. బాబు వివిధ కారణాలతో టీడీపీ వీడిని వాళ్లను తిరిగి రావాలని కోరారు.

కానీ తన సామాజిక వర్గ నేతలను ముందుగా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆయన సామాజికవర్గం ప్రభావితం చేసే ఉమ్మడి జిల్లాల్లోనే ఎక్కువగా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. ఇక్కడ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భ్రమలేవీ లేవు. కానీ ఐదారు సీట్లు గెలిచినా అది బాబు ఇమేజ్‌ తెలంగాణలో ఇప్పటికీ తగ్గలేదని ఆయన అనుకూల మీడియాతో ప్రచారం చేయడానికి సిద్ధంగానే ఉంటుంది.

ఎలాగూ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయవచ్చు అనే ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ అదే ఫార్ములాను అమలు చేసి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే బాబు యత్నిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. బాబు చెబుతున్న టీడీపీ పూర్వ వైభవం అంతా ఇక్కడ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేయడం, బీజేపీకి మేలు చేయడానికే అనే చర్చ జరుగుతున్నది.

అందుకే రెండు రాష్ట్రాలు తిరిగి ఎన్నటికీ కలవడం సాధ్యం కాదని, రెండు రాష్ట్రాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన చిరకాల వాంఛ అన్నారు. ఒకవేళ బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చినా తానే చక్రం తిప్పవచ్చని బాబు ఎత్తుగడలో భాగం అంటున్నారు.