Bandi Sanjay | పడి గాపులు కాయాల్సిందేనా?

  • Publish Date - April 12, 2024 / 01:07 PM IST

  • క్వింటాలుకు నాలుగు నుండి 7 కిలోల కోత

  • సంకేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

  • సర్కార్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్

 

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారమివ్వరు. తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొస్తే సకాలంలో కొనకుండా ముప్పు తిప్పలు పెడుతున్నరు. తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు 5 నుండి 8 కిలోల మేరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారు.

దళారీ వ్యవస్థను రూపుమాపుతామని,తాలు, తేమ, తరుగు పేరిట కోతలు లేకుండా దాన్యం కొనుగోలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లముందే దోపిడీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోదు.’’అని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా రైతులను డిఫాల్టర్లను మార్చిన ప్రభుత్వం రైతులకు కొత్తగా వడ్డీ లేకుండా రూ. 3 లక్షల రుణం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అయ్యిందన్నారు.

గురువారం వేములవాడ నియోజకవర్గంలోని సంకెపల్లి గ్రామానికి వెళ్లిన బండి సంజయ్ అక్కడ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై వారితో చాలా సేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకువచ్చి పదిరోజులు కావస్తున్నా, తూకం జరగకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదన్నారు.

తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 8 కిలోల చొప్పున కోత విధిస్తామని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. తమకు ఇంతవరకు రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని, క్వింటాలు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడం దేవుడెరుగు.. కనీస మద్దతు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులపై నిప్పులు చెరిగారు. వీటితోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపైనా మండిపడ్డారు.

తెలంగాణలో ప్రభుత్వం మారినా రైతుల బతుకుల్లో మార్పు లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేశారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 12 రోజులైంది…కానీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కూడా కొనుగోలు చేయలేకపోయారని చెప్పారు.

సిరిసిల్ల జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి గత వారం పదిరోజుల నుండి ఎదురు చూస్తున్నా కొనే నాథుడే లేకుండా పోయారని తెలిపారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మళ్లీ దళారుల రాజ్యం నడుస్తున్నది అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన వడ్లను యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, వారికి కనీస మధ్దతు ధర అందించాలని, తాలు, తేమ, తరుగు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని,దళారీ వ్యవస్థను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. రైతులు తమ పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తరువాత… వానకు తడిసినా అందుకు పూర్తి ప్రభుత్వమే బాధ్యత  వహించాలన్నారు.

Latest News