Telangana Phone Tapping Case | హైదరాబాద్, జూలై 25 (విధాత) : తెలంగాణ రాజకీయాలు కొంతకాలంగా సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలు ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. గత బీఆరెస్ ప్రభుత్వం యథేచ్ఛగా టెలిఫోన్ ట్యాపింగ్స్ చేయించిందని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు సైతం చేయిస్తుంటే.. తాజాగా మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారంటూ బీఆరెస్ నేతలు కొత్త ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయిస్తే తప్పులేనప్పుడు బీఆరెస్ ప్రభుత్వం చేస్తే తప్పేంటని ఆ పార్టీ అనుంగు మీడియా వితండ వాదనలు లేవనెత్తుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తుంటుందని చేసిన వ్యాఖ్యలకు మసిబూసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ బీఆరెస్ అనుకూల పత్రికల్లో కథనాలు వండివార్చుతున్నాయని మండిపడుతున్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదన్నారు. అయితే దానికి ఓ పద్దతి ఉందన్నారు. సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టులు, సమాజానికి ఇబ్బంది కల్గిస్తున్నారనే అనుమానం ఉన్నవారి ఫోన్లను పోలీసుశాఖ ట్యాపింగ్ చేస్తారని సీఎం చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కు పద్దతి ఉంటుందన్నారు. దీనికి ఈకలు పీకిన బీఆరెస్ మీడియా.. ఫోన్ ట్యాపింగ్ చేయడం సరైందేనని రేవంత్ రెడ్డి అంటున్నారని రెచ్చిపోయింది. ఉద్దేశపూర్వకంగానే తాము అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ పై దుష్ప్రచారం చేశారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. సంఘ విద్రోహ శక్తులపై కన్నేసి ఉంచడానికి ఇంటెలిజెన్స్ ట్యాపింగ్స్ చేస్తుంది. ట్యాప్ చేసేటప్పుడు సంబందిత నంబర్ పంపితే.. ఆ నంబర్ ఎవరిది? ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలు అన్నీ కేంద్రానికి పంపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. బీఆరెస్ హయాంలో జరిగింది దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. కేవలం నంబర్‌లు మాత్రమే పంపి, అవి ఎవరో మావోయిస్టులవి, సంఘ వ్యతిరేక శక్తులవని చెప్పి, తాము నిఘా ఉంచదల్చుకున్న వ్యక్తులు, రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రిటీల ఫోన్‌లు ట్యాప్ చేయించారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఒక పద్ధతి ప్రకారం జరిగేదానికి, యథేచ్ఛగా, అక్రమ మార్గంలో సాగిన దానికి లింకు పెట్టాలని కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేతలు బీఆరెస్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ట్యాపింగ్‌పై కొనసాగుతున్న ప్రస్తుత దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. సిట్ విచారణతో ప్రయోజనం ఉండదనేది కమలం పార్టీ వాదన. ఇదిలా ఉంటే.. విచారణ పేరుతో తనను సిట్ వేధింపులకు గురి చేస్తున్నదంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా?
మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలి మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ సైతం ట్యాప్ అవుతున్నదని అన్నారు. పెగాసెస్ వంటి సాఫ్ట్‌వేర్‌ను ప్రైవేట్ వ్యక్తులు ఆపరేట్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. పోలీసులతో ఈ సాఫ్ట్‌వేర్ ఆపరేట్ చేయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే ప్రైవేటు వ్యక్తులను ఎంచుకున్నారని కారు పార్టీ చెబుతున్నది. మంత్రుల కదలికలు, స్వంత పార్టీలో కీలక నాయకులు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతున్నదని ఆ పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో పసలేదని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం తమకు లేదని కాంగ్రెస్ పార్టీ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తమ పాలనను చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలపై ఆయన మండిపడ్డారు.
సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీబీఐ విచారణకు ఇవ్వాలనేది బీజేపీ డిమాండ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు చేశారు. బండితో పాటు ఆయన సిబ్బంది నుంచి సిట్ స్టేట్‌మెంట్ తీసుకోనుంది. సిట్ నోటీసుల మేరకు జూలై 24న సిట్ ముందుకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వనున్నట్టు బండి సంజయ్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున గురువారం ఆయన సిట్ ముందుకు రాలేదు. ఈ నెల 28న వస్తానని సమాచారం పంపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బీజేపీ నాయకత్వం కూడా సీరియస్‌గానే తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా అయిన బండి సంజయ్ నిఘా సంస్థల ద్వారా తెప్పించుకున్నారనే ప్రచారం సాగుతోంది. సీబీఐ విచారణ చేస్తే దీని వెనుక ఎవరెవరున్నారనే విషయాలు బయటకు వస్తాయని బీజేపీ నమ్ముతోంది. సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో సాగుతోంది. సిట్ కంటే సీబీఐ విచారణ చేయిస్తే అంతా తమ కంట్రోల్ ఉంటుందనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే బీజేపీతో బీఆరెస్ లాలూచీ పడేందుకు, బీజేపీ రాజకీయ అవసరాలకు బీఆరెస్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో బీఆరెస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరోపణలు చేసిన కిషన్ రెడ్డి.. అప్పుడు ఎందుకు సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీస్తున్నారు.
సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్
విచారణ పేరుతో సిట్ అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో ఎస్ఐబీలో కీలకంగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై జూలై 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పేరుతో తనను గంటల సమయం పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఆగస్టు 4న ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రభాకర్ రావు పిటిషన్ కంటే ముందే సిట్ అధికారులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావుకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని ఆ పిటిషన్ లో కోరారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సిట్ ఆరోపణలు చేస్తోంది.