Site icon vidhaatha

Bandi Sanjay | మీరు దీక్షలు చేయాల్సింది కరీంనగర్‌లో కాదు.. గాంధీభవన్ వద్ద

మీ పార్టీ మాట తప్పినందుకు..
కేసీఆర్ 10 ఏళ్లపాటు ప్రజలను అరిగోస పెట్టినందుకు
తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయ్..
దీక్ష చేస్తానన్న పొన్నంపై మండిపడ్డ బండి సంజయ్

విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పాలన వైఫల్యాలపై ఈనెల 14న కరీంనగర్ లో దీక్ష చేపడతానన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. పదేళ్లపాటు రాష్ట్రంలోని ప్రజలను రాచి రంపాన పెట్టిన బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ భవన్ వద్దనో, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినందుకు గాంధీభవన్ వద్దనో ఆయన దీక్ష చేపడితే బాగుంటుందని సంజయ్ హితవు పలికారు.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో శుక్రవారం ధాన్యపు కల్లాలను ఆయన సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రజలంతా మోదీ నాయకత్వంలోనే సురక్షితంగా ఉన్నారని, తెలంగాణకు మోదీయే శ్రీరామరక్ష అని సంజయ్ తెలిపారు. దేశంలో ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైందని, అసలు ఆ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో చెప్పే ధైర్యం కూడా లేదని, ఈ క్రమంలో ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చుకోలేని పార్టీకి ప్రజలు ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు.

మోదీ గత పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తున్నారు, ఈ మొత్తం కాలంలో గుర్తుకురాని దీక్షలు ఎన్నికలు రాగానే గుర్తుకు వచ్చాయా? అని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నందుకు నిరసనగా గాంధీభవన్ ఎదుట ఆయనను ధర్నా చేయమనండి..అప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలుగుతుందన్నారు.

కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఏళ్ల తరబడి బియ్యం ఇస్తున్నందుకు దీక్ష చేస్తారా? కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులిచ్చినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసినందుకు నిరసనగా దీక్ష చేస్తారా… ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి మస్లిం మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించినందుకు, పౌర సత్వ చట్ట సవరణ చేసినందుకు దీక్ష చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధే కరువయ్యారని, లోకసభ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతోనే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కలసి ఇలాంటి డ్రామాలకు తెరతీస్తున్నాయని అన్నారు. కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలకు పాల్పడినా తన విజయాన్ని అడ్డుకోలేరన్నారు.

Exit mobile version