విధాత : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించడం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. తీరొక్క పూలతో జరిపే ఈ పండుగను పూల పండుగ అని కూడా పిలుస్తారు.
భాద్రపద బహుళ అమావాస్య రోజున ప్రారంభమైన ఈ బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజులపాటు కొనసాగి సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పేర్చిన ఆడపడుచులు.. బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు వేశారు. మహిళలు, వృద్దులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు.
ఆదివారం బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర సీఎం కేసీఆర్ నిన్న తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం రాజ్‌భవన్‌లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజవకర్గాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు అక్టోబర్ 3వ తేదీన ముగియనున్నాయి.