MLC Kavitha | విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్( BRS Party )లో చీలికలు రావద్దనే ఉద్దేశంతో ఇబ్బందులను తట్టుకొని నిలబడినట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత( MLC Kavitha ) చెప్పారు. లండన్( London ) లో తెలంగాణ( Telangana )కు చెందిన పలువురితో సోమవారం ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పార్టీ బాగుండాలని తద్వారా తెలంగాణ బాగుండాలని ఎంతో తగ్గానని ఆమె అన్నారు. బీఆర్ఎస్ కోసం 20 ఏళ్లు కష్టపడ్డానన్నారు. కొందరిలో స్వార్థం ప్రవేశించిందని, స్వార్థపరుల వల్ల కోట్లాదిమంది బాధపడొద్దనేది తన తపన అని ఆమె అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తన విధానాలను సరిచేసుకోవాలని కవిత సూచించారు. పార్టీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లో తన ఓటమితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు అనేక కుట్రలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఎంత ఇబ్బందిపడినా తాను ఏ విషయాన్ని బయటపెట్టలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు మాట్లాడుతున్నానని ఆమె తెలిపారు.
ప్రజల్లోకి విషయాలు వచ్చాక మాట్లాడకపోతే తప్పు అవుతుందని మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తన విషయంలో జరగరాని పరిణామం జరిగిందన్నారు. దైర్యంగా ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. తనకు ఈ పరిస్థితి రావడానికి అవతలివాళ్లే కారణమని ఆరోపించారు. కష్టమని తెలిసి కూడా కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా ఈ పంథాను ఎంచుకున్నానని తెలిపారు. జైలు జీవితం తనను పూర్తిగా మార్చివేసిందని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు.