Heart Attack After Playing Bathukamma | బతుకమ్మ సంబరాల్లో బతుకును కోల్పోయిన లక్ష్మీ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న 66 ఏళ్ల లక్ష్మీ గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబం, గ్రామస్థులలో తీవ్ర ఆవేదన నెలకొంది.

woman-lakshmi-dies-of-heart-attack-after-participating-in-bathukamma-celebrations-in-hyderabad

హైదరాబాద్, విధాత, సెప్టెంబర్ 22(విధాత): బతుకమ్మ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఓ మహిళ సంబరాలు ముగిశాక గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్, ఆదిబట్లలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పారెళ్లి లక్ష్మీ(66) ఆదిబట్లలోని టీసీఎస్ మహిళా ఉద్యోగుల కోసం రామకృష్ణ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన హాస్టల్‌లో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి బతుకమ్మ వేడుకల్లో లక్ష్మీ పాల్గొన్నారు. అలసిపోయినట్లు అనిపించడంతో హాస్టల్‌లోనే నిద్రపోయారు. నిద్రపోయిన లక్ష్మీ నిద్రలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

కాగా లక్ష్మీ గతంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW)సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే లక్ష్మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో బతుతకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. బతుకుదెరువు కోసం వచ్చిన లక్ష్మీ బతుకమ్మ సంబరాల్లో బతుకు కోల్పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని పీవోడబ్ల్యూ నేతలు డిమాండ్ చేస్తున్నారు.