విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి వేదికగా సుదీర్ఘ పోరాటం చేసిన అంశల స్వామి శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే తన కల నెరవేరకముందే స్వామి ఈ లోకాన్ని విడిచిపోయాడు.
ఆ కల ఏంటంటే.. శివన్నగూడెం రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఫ్లోరోసిస్ నుంచి పూర్తి స్థాయిలో విముక్తి కలుగుతదని తమతో ఎల్లప్పుడూ చెప్పేవారని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అంతే కాకుండా సాగునీరు కూడా పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందని గట్టిగా నమ్మేవాడని తెలిపారు.
తన 37 ఏండ్ల జీవితంలో 30 ఏండ్ల పాటు ఫ్లోరైడ్ విముక్తి కోసమే పోరాటం చేశాడు. తనకున్న సెలూన్ షాపు ముందు స్వామి కూర్చొని.. నిరంతరం శివన్నగూడెం రిజర్వాయర్ పనులను చూసి మురిసి పోయేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రెండు గుట్టల మధ్య నిర్మిస్తున్న ఆ రిజర్వాయర్ వల్ల శివన్నగూడెంతో పాటు పలు ప్రాంతాలకు తాగు, సాగునీరు వస్తుందని సంతోషించేవాడని చెప్పారు. తన సెలూన్ నుంచి శివన్నగూడెం రిజర్వాయర్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి మురిసిపోయే వాడని గుర్తు చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకం అమలు చేసిన తర్వాత కొత్తగా ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదని స్వామి ఎప్పుడూ అంటుండేవారని పేర్కొన్నారు. ఈ పథకం అమలుతో ఫ్లోరైడ్‌తో కూడిన భూగర్భ జలాలను తాగే తిప్పలు పోయాయని అన్నారు.
శివన్నగూడెం రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చి, అటు తాగునీటికి, ఇటు సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయని స్వామి అనేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీళ్లు ప్రవహిస్తుంటే చూడాలని స్వామి కలలు కనేవారని బంధువు ఒకరు తెలిపారు. దురదృష్టావశాత్తూ ఆ కల నెరవేరకుండానే అంశల స్వామి చనిపోయాడు.