దౌత్యపరంగా భారత్ (India) కు ఘన విజయం దక్కింది. తమ ప్రాదేశిక జలాల్లోకి చైనా (China Vessels) కు చెందిన పరిశోధనా నౌకలను అనుమతించకూడదని శ్రీలంక (Sri Lanka) నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని దౌత్య మార్గాల్లో భారత ప్రభుత్వానికి చేరవేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనాన్ని వెలువరించింది. 2024 సంవత్సరానికి ఈ నిర్ణయం వర్తిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశోధనల పేరుతో చైనా నౌకలు భారత్‌కు సమీపంలో ఉండే శ్రీలంక తీరంలో తిష్ఠ వేయడం తరచూ జరుగుతోంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చైనాను శ్రీలంక ప్రభుత్వం కాదనలేకపోయేది.
తాజాగా భారత్ తీవ్ర స్థాయిలో తన అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో 2024 జనవరి 5న శ్రీలంకకు రానున్న చైనా గ్జియాంగ్ యంగ్ హాంగ్ 3 నౌకకు అనుమతి వచ్చే అవకాశం ఉండదు. ఈ నౌక ఏకంగా జనవరి 5 నుంచి మే వరకు మూడు నెలల పాటు శ్రీలంకలో ఉంటుందని ప్రతిపాదించింది. తాజా నిర్ణయంతో అది శ్రీలంకలో లంగరు వేసే అవకాశం లేదు. ఇటీవలి కాలంలో చైనా నేవీకి చెందిన సుమారు 25 నౌకలు ఇండియన్ ఓషన్‌లో ప్రయాణించినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
2023 జులైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేల భేటీలో.. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. భారత సార్వభౌమత్వాన్ని, భద్రతా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకోవాలని మోదీ స్పష్టం చేయడంతో శ్రీలంక దిద్దుబాటు చర్యలకు దిగినట్లు అర్థమవుతోంది. మరోవైపు మాలిలో చైనా అనుకూల ప్రభుత్వం కొలువుదీరడంతో డ్రాగన్ ఆ దిశగా పావులు కదుపుతోంది. తమ దేశానికి 4600 టన్నుల గ్జియామెన్ వెసెల్‌ను సముద్ర తీరంలో పరిశోధనల కోసం పంపుతామని ప్రతిపాదించింది. దీనిపై ఆ దేశ ప్రధాని మొహమ్మద్ ముయిజు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.