Site icon vidhaatha

Bihar | తలుపు కొట్టి తుపాకితో కాల్చారు.. బీహార్‌లో జర్నలిస్టుపై ఆగంతకుల ఘాతుకం

Bihar |

పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకున్నది. ఒక జర్నలిస్టును ఆయన ఇంటికి వచ్చిన ఆగంతకులు తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘటన.. పోస్టుమార్టం నిర్వహించిన దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆరియా (Araria) జిల్లాలోని రాణీగంజ్‌లో జర్నలిస్టు ఇంటికి వచ్చిన నలుగురు ఆగంతకులు.. తలుపు తట్టి జర్నలిస్టు తలుపు తీయగానే ఛాతీలో కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో జర్నలిస్టు అక్కడికక్కడే చనిపోయారు. మృతుడిని బిమల్‌ యాదవ్‌గా గుర్తించారు. ఆయన దైనిక్‌ జాగరణ్‌లో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తీసుకువెళ్లినప్పుడు అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. స్థానిక ఎంపీతోపాటు ఆరియా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు సైతం ఆ సమయంలో హాస్పిటల్‌ వద్ద ఉన్నారు.

ఘటనాస్థలానికి ఫోరెన్సిక్‌ బృందాన్ని పంపామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఎంపీ, లోక్‌జనశక్తి పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ విఫలమయ్యారని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీహార్‌లో అతి తక్కువ నేరాలు ఉంటున్నాయని ఇటీవల సీఎం నితీశ్‌కుమార్‌ చెప్పిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘ఆయన ఆ వివరాలను తమ ఇంటి దిక్కును కోల్పోయిన పోలీసు కుటుంబాలకు చూపించాలి.

ఆగంతకుల కాల్పుల్లో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి చూపించాలి’ అని అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా దురదృష్టకర ఘటన. ఈ వార్త తెలియగానే.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను’ అని తెలిపారు.

విమల్ సోదరుడు శశిభూషణ్ 2019లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన సాక్షి విమల్. ఈ కారణంతోనే విమల్‌ను హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Exit mobile version