BJP | మార్పుల వెనుక కారణాలివేనా?

BJP | విధాత‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ అధికారంలో ఉన్నది. ఈసారి అక్కడ కూడా కష్టమే అంటున్నారు. అందుకే వివిధ రాష్ట్రాల్లో సంస్థాగతంగా బలోపేతం కోసం బీజేపీ ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 20 రోజులుకు పైగా ఉత్సవాలు నిర్వహించింది. రాష్ట్రాల వారీగా అభివృధ్ధి […]

  • Publish Date - June 29, 2023 / 03:21 PM IST

BJP |

విధాత‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ అధికారంలో ఉన్నది. ఈసారి అక్కడ కూడా కష్టమే అంటున్నారు.

అందుకే వివిధ రాష్ట్రాల్లో సంస్థాగతంగా బలోపేతం కోసం బీజేపీ ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 20 రోజులుకు పైగా ఉత్సవాలు నిర్వహించింది. రాష్ట్రాల వారీగా అభివృధ్ధి కోసం కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇచ్చిన సహకారాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ఇదంతా ఆ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది.

ఆ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిస్తే కష్టమే..

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమిలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్నది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బలంగా ఉన్నది. పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల ఐక్య భేటీలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నచోట ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని మమతా బెనర్జీ ఇప్పటికే ప్రతిపాదించారు. దీన్ని మిగిలిన పక్షాలు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

అందుకే కాంగ్రెస్‌ ముఖ్త్‌ భారత్‌ అని నినదించిన బీజేపీ 2017 నుంచి 2023 వరకు వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా బాగా బలహీన పడుతున్నది. అందుకే ఆయా రాష్ట్రాల్లో గెలుపుతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే విపక్ష కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహించాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఇప్పటికే సూచించారు. కర్ణాటక తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌లతో రాష్ట్రాలతో పాటు, తెలంగాణపై ఫోకస్‌ పెట్టింది. ఇవి కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో గెలువడం కష్టమే అని కమలనాథులు అంచనాకు వచ్చారు.

వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను మార్చి…

ఎన్నికల వేళ వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటే తెలంగాణలోనూ అధ్యక్ష మార్పు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌ కొట్టిపారేసినా జేపీ నడ్డా, అమిత్‌షా, బీఎల్‌ సంతోష్‌లు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితి, సంస్థాగత మార్పులపై చర్చలు జరిపారు. త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పులు ఉండొచ్చు అంటున్నారు.

Latest News