న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్నపేలుడు ఘటన కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ఎన్‌ఐఏ కు ఈ కేసు అప్పగించిన నేపథ్యంలో పేలుళ్లు ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు. పేలుళ్ల ఘటనపై ఢిల్లీ పోలీసులు తొలుత ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేలుళ్ల ఘటనపై రెండుసార్లు సమీక్ష నిర్వహించిన అనంతరం కేసును ఎన్ ఐఏకి అప్పగించడం గమనార్హం. పేలుడు ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ సైతం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాక పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఢిల్లీ పేలుళ్లకు డా.ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. పేలుళ్లకు కారణమైన కారులోని వ్యక్తి శరీర భాగాలు అతడివే అని అనుమానిస్తున్న అధికారులు..దీనిపై నిజనిర్ధారణకు డీఎన్‌ఏ నమూనాల కోసం అతడి తల్లి షమీమా బేగంను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
