Delhi Car Bomb blast | ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు : 13మంది మృతి

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించి 8 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు విచారణ ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించబడింది.

Red Fort Blast in Delhi: 13 Dead, 30 Injured After High-Intensity Explosion Near Lal Qila Metro Station

(విధాత నేషనల్​ డెస్క్​)

న్యూఢిల్లీ, నవంబర్‌ 10:

దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భయంకర పేలుడు ధాటికి దద్దరిల్లింది. చారిత్రక ప్రాధాన్యమున్న ఎర్రకోట(రెడ్‌ఫోర్ట్‌ ) సమీపంలో ఒక కారు ఒక్కసారిగా పేలిపోవడంతో 13 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు సాయంత్రం 7 గంటల సమయంలో రెడ్​ఫోర్ట్​ మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 సమీపంలోని రద్దీ ప్రాంతంలో జరిగింది. ఘటన అనంతరం మంటలు వేగంగా వ్యాపించి పక్కన ఉన్న వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతం మొత్తాన్ని పొగ, భయాందోళన ఆవరించాయి.

ఎర్రకోట పేలుడు:అగ్నిగోళంగా ఎగిరిన కారు – భయంకర దృశ్యాలు

చాందినీ చౌక్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని రహదారిపై వాహనాలు క్రమంగా కదులుతుండగా, స్విఫ్ట్‌ డిజైర్‌ మోడల్‌ కారు ఒక్కసారిగా పేలిపోయిందని సాక్షులు చెబుతున్నారు. ఆ శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు శక్తి తీవ్రస్థాయిలో ఉండటంతో సమీప భవనాల కిటికీలు, తలుపులు కూడా కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నా ముందు రెండు అడుగుల దూరంలో ఉన్న కారే పేలింది. అది బాంబా, లేక వేరేదా తెలీదు. కానీ ఒక అగ్నిగోళంలా ఎగిరింది. నా చెవుల్లో ఇప్పటికీ ఆ శబ్దం మోగుతోందని ఆటో డ్రైవర్‌ జీషాన్‌ వణుకుతూ చెప్పాడు.

పేలుడు తర్వాత అగ్నిమాపక శాఖకు సమాచారం అందగానే 20 ఫైర్‌ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరాయి. డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఏ.కే. మాలిక్‌ మాట్లాడుతూ, మాకు 7 గంటల సమయంలో కాల్‌ వచ్చింది. వెంటనే ఏడు యూనిట్లు బయలుదేరాయి. 7:29 నిమిషాలకు మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. తీవ్రంగా గాయపడినవారిని లోక్‌నాయక్‌ ఆసుపత్రి, రామ్‌మనోహర్‌ లోహియా హాస్పిటల్‌ లకు తరలించగా, వైద్యులు ఎనిమిది మరణాలను ధృవీకరించారు.

పేలుడు అనంతరం వీడియోలు, చిత్రాలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి — పొగతో కప్పబడిన వాహనాలు, నేలపై పడిపోయిన శరీర భాగాలు, చుట్టుపక్కల గోడలకు తగిలిన మంటల గుర్తులు ప్రజల్లో భయాన్ని రేకెత్తించాయి. ఒక సాక్షి, ఒకరి శరీరం చీలిపోయింది. చేతి భాగం రోడ్డు మీద పడి ఉందని వణుకుతూ పేర్కొన్నాడు. మరొకరు, నా ఇల్లు గురుద్వారా సమీపంలో ఉంది. పేలుడు శబ్దం విని బయటికి పరుగెత్తి వచ్చాను. అది ఒక పెద్ద అగ్నిగోళంలా కనిపించిందన్నారు.

ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ దర్యాప్తు ప్రారంభం – దేశవ్యాప్తంగా హై అలర్ట్

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పెషల్‌ సెల్‌, ఫోరెన్సిక్‌ టీములను రంగంలోకి దించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (NSG) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు చోటుచేసుకున్న వాహన శకలాలు, ఇంధన నమూనాలు, రసాయన అవశేషాలన్నీ సేకరించి విశ్లేషణ చేస్తున్నారు.

హోం మంత్రి అమిత్‌ షా పరిస్థితిపై ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బి.కే. సింగ్‌ నుండి నివేదిక స్వీకరించి, NIA, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌లతో ప్రత్యేక సమీక్ష జరిపారు. “దర్యాప్తు ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుంది” అని ఆయన అన్నారు.

ఈ పేలుడు ఫరీదాబాద్‌లో 2,900 కిలోల విస్ఫోటక పదార్థాలు స్వాధీనం అయిన కొన్ని గంటలకే జరగడంతో రెండు ఘటనల మధ్య సంబంధం ఏమైనా ఉందేమోనన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. హర్యానా పోలీసులు 350 కిలోల అమోనియం నైట్రేట్‌, డిటోనేటర్లు స్వాధీనం చేసుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

ఘటన అనంతరం పాత ఢిల్లీ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఎర్రకోట, చాందినీచౌక్‌, జామా మసీదు, గురుద్వారా సిస్‌గంజ్‌ సాహిబ్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. రద్దీ ప్రాంతాల్లో బారికేడ్లు వేసి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

భద్రతా కారణాల రీత్యా ముంబై, లక్నో, డెహ్రాడూన్‌ నగరాల్లో కూడా హై అలర్ట్‌ ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, దేవాలయాలు, మార్కెట్లలో నిఘా పెంచారు.

రెడ్‌ఫోర్ట్‌ పేలుడు దిల్లీని మరోసారి కలచివేసింది. ఈ ప్రాంతం గతంలోనూ తీవ్రవాద దాడులకు వేదికైంది. ఇప్పుడు మళ్లీ అదే ప్రదేశం దద్దరిల్లడం ఆందోళన కలిగిస్తోంది. విచారణ అధికారులు “పేలుడు స్వభావం, కారులోని పదార్థాల మూలం, దానిలో వదిలిన ట్రేస్‌లు అన్నింటినీ విశ్లేషిస్తున్నాము. ప్రాథమికంగా ఇది ఒక ఉద్దేశపూర్వక దాడి లాగానే కనిపిస్తోంది” అన్నారు.

ఢిల్లీ పౌరుల దైనందిన జీవితాన్ని కుదిపేసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా సాయంత్రపు రద్దీతో నిండే చాందినీచౌక్‌ ఇప్పుడు పోలీసులు, అగ్నిమాపక వాహనాలు, బ్లాక్‌హెడ్‌లతో నిండిపోయింది. రాత్రంతా దర్యాప్తు కొనసాగనుండగా, ప్రజలు “మళ్లీ 1997 లా దాడులు మొదలవుతున్నాయా?” అనే భయంతో వణికిపోతున్నారు.