BJP | ఔర్‌ ఏక్‌ బార్‌ కిషన్‌రెడ్డి.. టీబీజేపీ సారథిగా నియామకం

BJP ముచ్చటగా మూడవసారి చాన్స్‌ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు నడ్డా మరో నాలుగు రాష్ట్రాల్లోనూ మార్పు ఏపీ చీఫ్‌గా పురందేశ్వరికి అవకాశం విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీలో కనీవినీ ఎరుగని రీతిలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకించిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి నూతన సారథిగా […]

  • Publish Date - July 5, 2023 / 02:28 AM IST

BJP

  • ముచ్చటగా మూడవసారి చాన్స్‌
  • ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ
  • చైర్మన్‌గా ఈటల రాజేందర్‌
  • ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు నడ్డా
  • మరో నాలుగు రాష్ట్రాల్లోనూ మార్పు
  • ఏపీ చీఫ్‌గా పురందేశ్వరికి అవకాశం

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీలో కనీవినీ ఎరుగని రీతిలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకించిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి నూతన సారథిగా కేంద్రమంత్రి జీ కిషన్‌ రెడ్డిని నియమించింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌లోనూ పార్టీ అధ్యక్షులను మార్చింది. ఏపీకి ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. జార్ఖండ్‌కు మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ, పంజాబ్‌కు సునీల్ కుమార్ జక్కర్, రాజస్థాన్‌కు గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షులయ్యారు. బండి సంజయ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతున్నది.

మూడోసారి కిషన్‌రెడ్డి

గతంలో ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా 2010 నుంచి 2014 వరకు పని చేసిన కిషన్‌రెడ్డి 2014 నుంచి 2016 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. తాజాగా బీజేపీ సారథిగా కిషన్‌ రెడ్డిని మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. 1980 నుంచి బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ హోదాలలో పని చేసిన కిషన్‌ రెడ్డిని బీజేపీ అధిష్టానం ముచ్చటగా మూడవసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.

కిషన్‌ రెడ్డి రెండు మూడు రోజుల్లో బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సౌమ్యుడిగా పేరున్న కిషన్‌ రెడ్డి పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాలను, అసమ్మతి నేతలను ఏకతాటిపై తెస్తాడనే నమ్మకం ఉందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు.

అంత సులువేమీ కాదు…

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న కిషన్‌ రెడ్డి మెరుగైన ఫలితాలను రాబట్టడం అంత సులువేమీ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో హైదరాబాద్‌లో వరదలు ముంచెత్తడం, బీఆరెస్‌ కార్పొరేటర్లపై వ్యతిరేకతతో పాటు అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేని కారణంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కొంత లాభపడింది.

మాస్‌ లీడర్‌గా పేరున్న బండి సంజయ్‌ సారథ్యంలో ఇతర పార్టీల నుంచి చాలా మంది ముఖ్య నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని చూపుతూ వచ్చిన బీజేపీ.. తెలంగాణలో బీఆరెస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకున్నది. కానీ ఇటీవల బీజేపీలో అసమ్మతి తీవ్రరూపం దాల్చడం, కాంగ్రెస్‌ పుంజుకోవడంతో బీజేపీకి అంత సీన్‌ లేదన్న విషయం వెల్లడైంది.

కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ వర్గాలుగా నాయకులు చీలి పోయారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునంధన్‌ రావు బండి సంజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో రాష్ట్ర బీజేపీతో పాటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే లేచింది. ఇలాంటి పరిస్థితులలో అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్‌ రెడ్డి మరో నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది. ముందుగా బీజేపీలో అంతర్గత సవాళ్లను పరిష్కరిస్తేనే కిషన్‌ రెడ్డి సక్సెస్‌ అవుతాడని బీజేపీ సీనియర్‌ నాయకులు పేర్కొంటున్నారు.

ఈటలకు ప్రమోషన్‌…

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బీజేపీ అధిష్ఠానం ప్రమోషన్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటలకు తాజాగా ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల.. తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వ్యక్తినని చెప్పారు.

కేసీఆర్ బలం, బలహీనతలు కూడా తనకు తెలుసని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంతో అనుభవం ఉన్న కిషన్‌ రెడ్డితో కలిసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేస్తామన్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులకు ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అడ్డుతిరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌?

అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకు బండి సంజయ్‌ గట్టి ప్రయత్నాలే చేశారని, కానీ అవి పని చేయలేదని తెలుస్తున్నది. బండిని అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించాలని ఇక్కడి ఆరెస్సెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారని, అధ్యక్ష మార్పును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం.

బండిని మారిస్తే రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలించవని పేర్కొన్నారని తెలిసింది. కానీ అప్పటికే నిర్ణయం కావడంతో చేసేది లేక బండి సంజయ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.