- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
- సమక్షంలో చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే
- ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పై కేసు నమోదు
విధాత: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లీ విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై దాడి చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలోనే చెంపదెబ్బ కొట్టారు. పుణెలోని సాసూన్ హాస్పిటల్‌లో ట్రాన్స్‌జెండర్ వార్డును శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టారు. ఘటన జరిగినప్పుడు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వేదికపైనే ఉన్నారు.
ఈవెంట్ తర్వాత బయటకు వెళ్తున్న ఎమ్మెల్యే సునీల్ కాంబ్లీ అక్కడే నిలబడి ఉన్న పోలీసు అధికారిపై కోపం తెచ్చుకుని అతడిని చెంపదెబ్బ కొట్టినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. శంకుస్థాపన బోర్డుపై తన పేరు లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఈ దాష్టికానికి పాల్పడినట్టు తెలుస్తున్నది.
డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టినందుకు బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లేపై కేసు నమోదైంది. పుణె బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ అధికారి తెలిపారు.