BJP |
విధాత: బీజేపీ – ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి మతంతోపాటు కులం కూడా బలమైన పునాది అన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీలకు అప్పుడప్పుడు ఉన్నత పదవులు ఇచ్చినా.. వారి ఎజెండాలో ఏమార్పూ ఉండదని మరోసారి నిరూపితమైంది.
పార్లమెంటు నూతన భవనం శంఖుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు చూస్తే ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ (BJP ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసిన సమయంలో భారత ప్రథమ పౌరుడిగా (రాష్ట్రపతి) ఎస్సీ వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్ ఉన్నారు. ఆయనను రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. ఈ నెల 28న పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రపతిగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము ఉన్నారు. ఈమెను రాష్ట్రపతిని చేసింది కూడా బీజేపీనే. వీరిని రాష్ట్రపతులుగా ప్రతిపాదించిన సమయంలో బీజేపీ నేతలు దేశ ప్రజల చెవులు చిల్లులు పడేలా డబ్బాలు చరిచారు.
ఇప్పుడు భవనాన్ని ప్రారంభిస్తున్నది కూడా నరేంద్రమోదీయే. ఇప్పుడు కూడా రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం అందలేదు. ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసిన బీజేపీకి ఆమె పట్ల, ఆమె సామాజిక వర్గం పట్ల ఎంత గౌరవం ఉన్నదో దీనినిబట్టే తేటతెల్లమవుతున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే రాంనాథ్ కోవింద్, ద్రౌపతి ముర్ము ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. దేశ అత్యున్నత పదవులు చేపట్టినా, వారు సంఘ్ సిద్ధాంతాలను జీవితాంతం మోసినా వారికి కులాన్ని బట్టే విలువ ఉంటుందని బీజేపీ- ఆర్ఎస్ఎస్ వర్గాలు పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా స్పష్టమైన సందేశం ఇస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు అంటున్నారు.
తేదీపైనా వివాదం
పార్లమెంటు భవనం ప్రారంభించేందుకు నిర్ణయించిన తేదీ కూడా వివాదాస్పదమవుతున్నది. దేశభక్తుడని, దేశోద్ధారకుడని బీజేపీ ప్రచారం చేస్తున్న ఏకైక వ్యక్తి సావర్కర్ జన్మదినం నాడే పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.
కమలం పువ్వును గుర్తుకు తెచ్చేలా రాజ్యసభ హాలు
ఏమిటంటే కొత్త పార్లమెంటు భవనంలో రాజ్యసభ హాలును లోటస్ థీమ్‌తో తీర్చిదిద్దారు. అంటే కమలం పువ్వు అన్నమాట. ఇది బీజేపీ పార్టీ గుర్తు. జాతీయ పుష్పం కూడా అదే కావచ్చు కానీ.. రేపు కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైతే అన్ని పార్టీల సభ్యులు బీజేపీ సింబల్ కింద కూర్చొని చర్చలు చేస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోరనే గ్యారంటీ లేదు.
తెలంగాణలో సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తే రాష్ట్ర గవర్నర్ స్వయంగా గుస్సా అయ్యారు. తనను పిలువనేలేదని బహిరంగ ప్రకటనలు చేశారు. బీజేపీ నేతలైతే ధర్నాలు కూడా చేశారు. మరిప్పుడు దేశ ప్రథమ పౌరుడికి వారు ఇస్తున్న గౌరవం ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.