BJP | కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించే కాలం వచ్చింది: కిషన్ రెడ్డి

BJP ప్రధాని పర్యటనను బీఆర్​ఎస్​ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలి బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణకు అన్యాయం రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం కేంద్రమంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని బాయ్ కాట్ చేసే సమయం ఆసన్నమైందని కేంద్రమంత్రి రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోష్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రధాని పర్యటనను కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు […]

  • Publish Date - July 8, 2023 / 11:03 AM IST

BJP

  • ప్రధాని పర్యటనను బీఆర్​ఎస్​ ఎందుకు బహిష్కరించిందో చెప్పాలి
  • బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణకు అన్యాయం
  • రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం
  • కేంద్రమంత్రి, నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని బాయ్ కాట్ చేసే సమయం ఆసన్నమైందని కేంద్రమంత్రి రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోష్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రధాని పర్యటనను కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బహిష్కరించిందో చెప్పాలని నిలదీశారు. ప్రధాని పర్యటన సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో శనివారం ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయన ఒకింత ఉద్వేగంగా ప్రసంగించారు.

అభివృద్ధికి సహకరిస్తే బహిష్కరిస్తారా

మూడు వేల మందికి ఉపాధి కల్పించే వ్యాగన్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాని పర్యటనను కెసిఆర్ బాయ్కాట్ చేస్తున్నారా అంటూ కేంద్రమంత్రి ప్రశ్నించారు. నేషనల్ హైవే పనులను ప్రారంభిస్తున్నందుకు బాయ్కాట్ చేస్తున్నారా? టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తున్నందుకు బాయ్కాట్ చేస్తున్నారా? కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు

తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి, దళితున్ని ముఖ్యమంత్రి చేయనందుకు, కేసీఆర్ దళితులకు గిరిజనులకు మూడెకరాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు ఆ కుటుంబాన్ని బహిష్కరించే కాలం వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు, యువతను మోసం చేసి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోసినందుకు, మతోన్మాద మజిలీస్కు మద్దతుగా నిలుస్తున్నందుకు, రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు బాయ్ కాట్ చేస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం

రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.

అలాగే రూ.1900 కోట్లతో హైదరాబాద్-వరంగల్ రహదారిని మంజూరు చేశామన్నారు. ఇవాళ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ద్వారా 3వేల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం

బిజెపిపై ఈ మధ్యకాలంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒకటేనని, ఈ రెండు పార్టీలలో ఎవరికి ఓటు వేసిన తెలంగాణకు భవిష్యత్తు ఉండదని, రాష్ట్రానికి అన్యాయం చేసిన వారవుతారని అన్నారు. రాష్ట్రంలో బిజెపి నాయకత్వం సమిష్టిగా కృషిచేసి కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ బహిరంగ సభలో భద్రకాళి సాక్షిగా హామీ ఇచ్చారు.