Bro Movie Review | మ్యాటరుంది.. మామా అల్లుళ్లు మడతెట్టేశారు ‘బ్రో’!

Bro Movie Review | మూవీ టైటిల్: ‘బ్రో’ విడుదల తేదీ: 28 జూలై, 2023 నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, రోహిణి, బ్రహ్మానందం, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, సుబ్బరాజు, అలీ రెజా తదితరులు డీఓపీ: సుజిత్ వాసుదేవ్ ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్ ఎడిటర్: నవీన్ నూలి సంగీతం: ఎస్.ఎస్. థమన్ స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్ రచన, దర్శకత్వం: పి. సముద్రఖని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా […]

  • Publish Date - July 28, 2023 / 10:20 AM IST

Bro Movie Review |

మూవీ టైటిల్: ‘బ్రో’
విడుదల తేదీ: 28 జూలై, 2023
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, రోహిణి, బ్రహ్మానందం, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, సుబ్బరాజు, అలీ రెజా తదితరులు
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: ఎస్.ఎస్. థమన్
స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు మెగా ఫ్యాన్స్‌కి పండగే. అలాంటిది మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా కలిసి నటించనుండటంతో.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా? అని ఎంతో ఆతృతగా ఉన్నారు.

అనౌన్స్ చేసిన చాలా తక్కువ రోజులలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక ఆల్రెడీ కోలీవుడ్‌లో ఓటీటీలో విడుదలై.. మంచి ఆదరణను పొందిన ‘వినోదయ సిత్తం’ సినిమాని రీమేక్ చేస్తున్నారనగానే.. అందులో ఉన్న విషయం ఏమిటనేది తెలుసుకోవడానికి మ్యాగ్జిమమ్ మెంబర్స్ ఈ సినిమాని చూసే ఉంటారు.

మొదట్లో చాలా మంది రీమేక్ అవసరమా? అంటూ పెదవి విరిచారు కూడా. అయితే ఎప్పుడైతే ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారనే వార్త బయటికి వచ్చిందో.. ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి.. ఏదో రకంగా ఈ సినిమా వార్తలలో ఉంటూనే ఉంది. పాటలు విడుదలైనప్పుడు థమన్ సరిగా మ్యూజిక్ ఇవ్వలేదని, ట్రైలర్ విడుదలైనప్పుడు ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అని.. ఇలా సినిమాని నిత్యం వార్తలలో ఉంచేలా మేకర్స్ ప్రయత్నించారు.

అలాగే ‘విరూపాక్ష’ తర్వాత సాయిధరమ్ తేజ్ చేస్తున్న సినిమా, మేనమామతో మొదటిసారి చేస్తున్న సినిమా అనే విషయం కూడా ఈ సినిమా క్రేజ్‌కు కారణమైంది. మొత్తంగా అయితే చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్‌ని పలకరించిన పెద్ద సినిమాగా నేడు (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఎలాంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుందో మన రివ్యూలో తెలుసుకుందాం.

Vinodhaya Sitham Review | చూస్తే.. టైమ్ లేదనే మాటే ఉండదు.. ‘బ్రో’‌తో బాక్సాఫీస్ బద్దలే!

కథ:

కోలీవుడ్‌లో విజయం సాధించిన సినిమానే రీమేక్ చేశారు.. కానీ తెలుగు నెటీవిటీకి మాతృకలోని మ్యాటర్‌‌కి భంగం కలిగించకుండా.. చాలా జాగ్రత్తగా త్రివిక్రమ్ ఈ కథని మలిచారు. అక్కడ 50 ఏళ్ల పైబడిన కుటుంబ పెద్దపై ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఇక్కడ యువకుడు, ఇంటికి పెద్ద కొడుకు అయిన మార్కండేయులు బాధ్యతలు తీసుకున్నట్లుగా మార్చారు. కథలోకి వస్తే.. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయిధరమ్ తేజ్).. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకుంటాడు.

అమ్మ, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు వీరందరికి దిక్కు మార్కే. వీరందరినీ ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, జాబ్‌లో మంచి ఉన్నతికి చేరుకోవాలని.. వర్కే ప్రధానంగా ముందుకు సాగుతుంటాడు. ఇలా అసలు టైమ్ లేదంటూ.. పనిలో నిమగ్నమైన మార్క్‌కి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది.. చనిపోతాడు కూడా. టైమ్ లేదు టైమ్ లేదు అని అస్తమానం మాట్లాడే మార్క్‌‌కి చనిపోయిన తర్వాత టైమ్ (పవన్ కళ్యాణ్) ప్రత్యక్షమై స్వర్గానికి తీసుకెళుతుంటాడు.

కానీ మార్క్.. ఆ టైమ్‌తో తన ఆవేదనని చెప్పుకుంటాడు. అమ్మకు హెల్త్, చెల్లెళ్లలకి పెళ్లిళ్లు, తమ్ముడిని సెటిల్ చేయాలి.. చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు నన్ను తీసుకెళ్లిపోతే వారు రోడ్డున పడతారు అంటూ.. మొర పెట్టుకుంటాడు. దీంతో టైమ్.. మార్క్ బాధ్యతలన్నింటిని సెటిల్ చేసుకోవడానికి 90 రోజుల టైమ్ ఇస్తాడు. కాకపోతే ఓ కండీషన్ పెడతాడు.

ఈ 90 రోజులు తన పక్కనే ఉంటాననే కండీషన్‌కి ఒప్పుకున్న మార్క్.. మళ్లీ బతుకుతాడు. టైమ్ తనకి చ్చిన 90 రోజుల టైమ్‌లో మార్క్ ఏం చేశాడు? తన బాధ్యతలన్నింటినీ నెరవేర్చాడా? మరి మార్క్ ప్రేయసి సంగతేంటి? 90 రోజుల పాటు మార్క్ పక్కన ఉన్న టైమ్.. ఎలా అతడిని ఆట పట్టించాడు? చివరికి ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్‌ దేవుడిగా చాలా కూల్‌గా కనిపిస్తాడు. దేవుడు ఇంత ప్రశాంతంగా ఉంటాడా? అనిపించేంతగా పవన్ ఆ సినిమాలో మెప్పిస్తాడు. దాదాపు ఇందులో కూడా అలాంటి పాత్రే కానీ.. ఇందులో ఆయన టైమ్. ‘కాలం’ ఇలా ఉంటుందా? మన జీవితంలో ఒడిదుడుకులకు కాలమే కారణం అనేలా ఆయన పాత్ర ఉంటుంది. ఆ సినిమాలోని పాత్రకు, ఈ సినిమాలోని పాత్రకు చాలా తేడా ఉంటుంది. ‘కామ్’ అనే పదానికి ‘కాలం’ వ్యతిరేకం అనేలా.. పవన్ ఇందులో ఫుల్ ఎనర్జీగా కనిపిస్తాడు.

ముఖ్యంగా ఆయన డ్రస్సింగ్ స్టైల్ అదిరిపోయింది. నటనగా.. ఆయన చేసిందేం లేదు. న్యాచురల్‌గా పవన్ కొన్ని సినిమాలలో ఎలా అయితే చేస్తాడో అలానే చేసుకుంటూ వెళ్లిపోయాడు. కనిపించిన ప్రతీసారి ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లేలా త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తే.. థమన్ తనకి ఎంత ఎక్కేసిందో.. అలా బాదిపడేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఏమేం ఊహిస్తారో.. వాటన్నింటిని జోడించి.. ఓ కమర్షియల్ లుక్‌ని ఈ సినిమాకు త్రివిక్రమ్ సెట్ చేశాడు.

సాయి తేజ్ చాలా పరిణితి కలిగిన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేక్షకులకు కావాల్సిన మంచి డ్రామా అతని పాత్రలో పండింది. ఒరిజినల్‌లో చేసిన తంబిరామయ్యను మించి చేశాడని చెప్పలేం కానీ.. తన పాత్రకు మాత్రం తేజ్ 100 శాతం న్యాయం చేశాడు. రియల్ లైఫ్ యాక్సిడెంట్ కూడా ఆయనకు ఈ సినిమా విషయంలో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు.

సాయితేజ్ లవర్‌గా కేతిక కనిపించేది తక్కువే అయినా.. ప్రేక్షకులను మాంచి రొమాంటిక్ ఫీల్‌లోకి తీసుకెళుతుంది. సాయితేజ్ చెల్లెళ్లుగా చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్, లక్ష్మీలకు మంచి పాత్రలు పడ్డాయి. అలాగే తల్లిగా చేసిన రోహిణి జీవించేసింది. ఇంకా ఇతర పాత్రలలో కనిపించిన తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అలీ రెజా, వెన్నెల కిశోర్, పృథ్వీ వంటి వారంతా వారికి దక్కిన పాత్రలకు న్యాయం చేశారు. ఓ చిన్న పాత్రలో కనిపించి బ్రహ్మీ తన మెరుపులు మెరిపించాడు. పాత్రలన్నీ చక్కగా సెట్టయ్యాయి.

సాంకేతిక విభాగానికి వస్తే.. పాటలపై మొదటి నుంచి కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా.. సినిమాలో మాత్రం చాలా బాగా చిత్రీకరించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థమన్ అరిపించేశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అనేలా మరోసారి థమన్ తన మార్క్ ప్రదర్శించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణపు విలువలు హైలెట్ అనేలా ఉన్నాయి. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ‘టైమ్’ లేదు కాబట్టి ఏదో అలా లాగించేశారు.. అనేలా అవి తెలిసిపోతున్నాయి.

ఇక ఈ సినిమాకి ప్రధాన హైలెట్ త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా కొన్ని డైలాగ్స్‌ని పవన్ కళ్యాణ్‌తో చెప్పించాడు. అలాగే జనసేన పార్టీకి ప్లస్ అయ్యేలా కొన్ని డైలాగ్స్ రాసి.. ఫ్యాన్స్‌కి ఇంకాస్త ఊపు తెప్పించాడు. స్క్రీన్‌ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. సముద్రఖని కూడా ఆల్రెడీ చేసిన సినిమానే కాబట్టి.. ఎక్కడా తొణకలేదు. మాతృకతో పోల్చుకుంటే.. ఇందులో స్టార్ క్యాస్ట్ యాడయింది.. దానిని సముద్రఖని బాగా వాడుకున్నాడని చెప్పుకోవచ్చు.

విశ్లేషణ:

ముందుగా ఈ సినిమా మాతృకని ఆల్రెడీ చూసేసిన వారికి.. ఈ సినిమా అంతగా అనిపించకపోయినా.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. కథ మార్చిన విధానం కూడా బాగా నచ్చుతుంది. చూడని వారు మాత్రం ఈ సినిమాకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అసలు ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అంతా అనుకున్నది పవన్ కళ్యాణ్ పాత్ర గురించి కాదు.. సాయితేజ్ పాత్ర గురించి. అతని పాత్రే ఈ సినిమాకు కీలకం.

మాతృకలో తంబిరామయ్య చాలా అనుభవం ఉన్న నటుడు. భర్తగా, తండ్రిగా, బిజినెస్ మ్యాన్‌గా అతని కోణం ఉంటుంది. మరి ఇక్కడ సాయితేజ్ యువకుడు. అతని పాత్రని ఎలా మారుస్తారనేదే.. ఆసక్తికర విషయంగా చెప్పుకోబడింది. అయితే త్రివిక్రమ్ ఆ పాత్రని మార్చిన తీరు, అందులో సాయితేజ్ యాక్ట్ చేసిన తీరు.. హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. ఇంకాస్త ఎమోషన్ పండించే అవకాశం కూడా ఉంది. కానీ.. అతనిపై ఒత్తిడి పెట్టకూడదనేలా.. జాగ్రత్త తీసుకున్నట్లు అనిపించింది.

ఇక మేనమామ, మేనల్లుడు ఎపిసోడ్స్.. ఫ్యాన్స్‌కే కాకుండా.. సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ నచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ హిట్ పాటలన్నింటినీ పేర్చిన విధానం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తుంది. ఆయన యాక్టింగ్ కొంతమందికి ఎప్పుడూ ఉండే ఓవరాక్షన్ అని కూడా అనిపించవచ్చు. ఇవన్నీ అటుంచితే.. ఇందులో చెప్పాలనుకున్న టైమ్ విషయం గురించి మాత్రం.. మాతృకని దించేశారు.

మాతృకకి, ఈ ‘బ్రో’కి డిఫరెన్స్ త్రివిక్రమ్ కలం బలం. మనషులని ఆయన వర్ణించిన తీరు, టైమ్ గొప్పతనం గురించి వివరించిన తీరు, చివరిలో చెప్పే డైలాగ్స్.. ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టాప్ అంతా హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేస్తే.. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు లేకుండా.. సముద్రఖని చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సున్నితంగా చెప్పేశాడు. అతని ప్రయత్నం పవన్ కళ్యాణ్ రూపంలో అందరికీ చేరే అవకాశం ఉంది.

భవిష్యత్ కోసం పరుగులు పెట్టకుండా.. ప్రజంట్‌లో బతకడం నేర్చుకోండి.. అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశ్యం. మొదటే చెప్పుకున్నట్లుగా మాతృకకు భంగం కలిగించకుండా.. కమర్షియల్ అంశాలు అద్దిన తీరు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయి. లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ అనేది భగవంతుడు ప్రసాదిస్తే.. వాస్తవానికి, భ్రమకు ఉన్న తేడా.. మనిషి నడవడిక.. ఇలాంటి అంశాలన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

ఇంకాస్త ఎమోషనల్‌గా టచ్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా అడుగులు వేయలేదు. ఎంటర్‌టైన్ చేస్తూ.. విషయాన్ని ప్రేక్షకులకు ఎక్కించాలనే సముద్రఖని ప్రయత్నం సక్సెస్ అయినట్లే. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి చిత్రంగా నిలబడే అవకాశాలే ఉన్నాయి. మామా అల్లుళ్ల మ్యాజిక్ ఫ్యాన్స్‌కే కాకుండా.. ప్రేక్షకులకి కూడా కిక్ ఇస్తుంది.

ట్యాగ్‌లైన్: మ్యాటరుంది.. మామా అల్లుళ్లు మడతెట్టేశారు ‘బ్రో’!
రేటింగ్: 3/5

Latest News