BRS
(విధాత ప్రత్యేక ప్రతినిధి)
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తెలంగాణపైనా తీవ్ర ప్రభావం చూపాయి. చిన్నచిన్న వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఉన్నదన్న వాతావరణం కనిపిస్తున్నది. నేతలు ఐక్యంగా ముందుకు సాగడం, ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు, పట్టున్న నాయకులు కాంగ్రెస్‌లోకి రావడం అనేవి ఆ పార్టీ గ్రాఫ్‌ను పెంచాయనేది కాదనలేని వాస్తవం.
అయితే.. ఈ భావన మరింత పెరిగి, బలపడితే తన అధికారానికి ముప్పు తప్పదన్న అభిప్రాయంతో ఉన్న బీఆరెస్ అధిష్ఠానం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పెరుగుతున్నదనే అభిప్రాయానికి, అధికార పీఠానికి దగ్గరవుతున్నదని జరిగే ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇందుకోసం నేరుగా సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేశారని చెబుతున్నారు.
ముఖ్యంగా బీఆరెస్, బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున సాగుతున్న వలసలకు ఆపరేషన్ అడ్డుకట్ట వేయడమే కాకుండా.. వాటిని తనవైపు తిప్పుకొని ‘గులాబీ ఆకర్ష్’గా మార్చాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు పేర్కొంటున్నారు. తద్వారా కాంగ్రెస్ ఆత్మస్థైర్యానికి గట్ట ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే.. గట్టిగా పనిచేస్తే కాంగ్రెస్‌కు అధికారం ఖాయం అనుకుంటున్న పరిస్థితుల్లో అనవసరంగా పార్టీ మారడం ఎందుకనే భావన కాంగ్రెస్‌లో పలువురు అసంతృప్త నేతల్లో కనిపిస్తున్నది.
‘ఆపరేషన్ గులాబీ ఆకర్ష్’ను ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత జిల్లా మెదక్ నుండే మొదలు పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి విస్తరిస్తున్నారని పలువురు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలతో, ఆ పార్టీలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ టచ్‌లోకి వెళ్లారని, పార్టీలోకి వారిని ఆహ్వానిస్తూ భారీ ఆఫర్స్, ప్యాకేజీలు వారి ముందుంచారని ప్రచారం సాగుతున్నది.
కేసీఆర్ ఆఫర్‌కు ఒకరిద్దరు చిన్న నాయకులు సానుకూలంగా ఉన్నా.. ముఖ్య నేతలు మాత్రం బీఆరెస్‌లోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. మంత్రి పదవులతో పాటు ఆర్థికంగా చేయూత, కుటుంబ సభ్యులకు టికెట్లు వంటి ఆఫర్లతో కేసీఆర్ పలు జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నేతలకు గాలం వేశారని తెలుస్తున్నది. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ కొన్ని కమిటీలు నియమించింది.
దీనిలో స్థానం దక్కనివారు, అసంతృప్తితో ఉన్నవారికి ఆఫర్లు వెళుతున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ ఆఫర్లపైన, ప్యాకేజీలపైన ఆలోచనలో పడ్డ నాయకులు తగిన సమయంలో తమ నిర్ణయాన్ని వెల్లడించాలని యోచిస్తున్నారు.
రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆరెస్.. అది చేశాను.. ఇది చేశాను.. అని చెప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై మాత్రం అనేక నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో సిటింగ్‌లకు, వీరికి మధ్య అగాధం ఏర్పడింది.
ఇప్పటికే పలు చోట్ల సిటింగ్‌లకు సీట్లు ఇవ్వొద్దంటూ బహిరంగంగానే వ్యాఖ్యానాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ పరిణామాలన్నీ బీఆరెస్‌ను సతమతం చేస్తున్నాయి. వీటిని అధిగమించి, మూడోసారీ అధికార పీఠం ఎక్కే ప్రయత్నాల్లో ఉన్న బీఆరెస్.. తనకు దీటుగా ఎదుగుతున్న కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో అణచివేయాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రతిపక్షాల్లోని బలమైన నేతలపై కేసీఆర్ కన్నేశారని అంటున్నారు. ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రితోపాటు.. కేసీఆర్, హరీశ్, కవిత ఈ అంశాన్ని రహస్యంగా నిర్వర్తిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తున్నది.
మెదక్ జిల్లాకు సంబంధించి ఐదారుగురు కీలక నేతలు దామోదర్ రాజనరసింహ, తూర్పు జగ్గారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ వంటి ముఖ్యులతో కేసీఆర్ రహస్య మంతనాలు చేశారని, ఇదే రీతిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోనూ చర్చించారని గతంలోనే ప్రచారం సాగింది. స్వయంగా ఉత్తమ్, జానాలతో సహా అందరూ పార్టీ మార్పుపై రేగిన ప్రచారాన్ని ఖండించారు.
అయితే రాష్ట్రంలో బహుళ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ సాగనుందని, ఎంఐఎం, వామపక్షాలు తమతోనే ఉంటాయని కేసీఆర్ వారితో చెబుతున్నారని సమాచారం. వివిధ రాజకీయ సమీకరణలతో బీఆరెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, అందుకు మీ చేరికల అవసరం కూడా ఉందంటూ ఆహ్వానిస్తున్నారని, పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదంటు భరోసాను కూడా ఇస్తున్నదని చెబుతున్నారు.
పెద్ద నేతలు తమ దారికి రాని పక్షంలో ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయో అక్కడ కీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, నియోజవర్గ, మండల స్థాయి నాయకులను బీఆరెస్‌లోకి రప్పించేందుకు పార్టీ నాయకత్వం పావులు కదుపుతున్నదని సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నుండి పలువురు మండల నేతలు బీఆరెస్‌లో చేరారు.
ఇదే రీతిలో ఇతర నియోజకవర్గాల్లోనూ చేరికలను ప్రోత్సహించే దిశగా బీఆరెస్ అధినాయకత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీఆరెస్‌కు వ్యతిరేక గాలి వీస్తున్నదన్న సర్వే నివేదికల నేపథ్యంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
దక్షిణ తెలంగాణలో సీట్ల సంఖ్య తగ్గే పక్షంలో ఉత్తర తెలంగాణలో సీట్లను పెంచుకునే దిశగా విపక్షాల నుండి వలసలను ప్రోత్సహించాలనేది వారి ఆలోచనగా చెబుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌లోని అసంతృప్తనేతలు, టికెట్ దక్కే అవకాశం లేని వారే టార్గెట్‌గా భారీ ఆఫర్లు, ప్యాకేజీలు ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు.
అయితే.. అటు నుంచి స్పందనలు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్రధాన పోటీదారు కాంగ్రెసేనని , అన్నీ కలిసి వస్తే.. అధికారం చేపట్టే అవకాశం కూడా ఉన్నదనే అభిప్రాయాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారని తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే కీలక నేతలు, సీనియర్‌లు బీఆరెస్ ఉచ్చులో పడకుండా జగ్రత్తపడుతున్నారని తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు వలకు చిక్కకపోయినా.. టికెట్‌లు రావనే పరిస్థితి ఉంటే తమలోకి వస్తారేమోనన్న ఆశ మాత్రం బీఆరెస్ నాయకత్వంలో ఉన్నదని, ఆ దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.