Palla Rajeshwar | మద్ధతు ధర అందక రైతాంగం విలవిల

  • Publish Date - April 12, 2024 / 02:50 PM IST

  • పట్టించుకోని మంత్రులు

  • బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం

 

విధాత, హైదరాబాద్‌ : పండించిన పంటకు కనీస మద్దతు ధర రాకుండ రైతులు నష్టపోతున్నారని, వారి సమస్యలు పట్టించుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారో తెలియడం లేదని జనగామ బీఆరెస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగక, మిల్లర్లు, వ్యాపారుల చేతిలో రైతాంగం మోసపోతు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారని పల్లా ఆరోపించారు. సీఎం ఆదేశించినా క్వింటాల్‌కు రూ.30 మాత్రమే పెంచారని విమర్శించారు.

వడ్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్కువ ధర ఇచ్చారని తెలిపారు. జనగామలో 193 కొనుగోలు కేంద్రాలు పెట్టారని, అందులో ఒక్కటి కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ధాన్యం క్వింటాకు రూ.2500లకు కొంటామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కనీస మద్దతు ధరకంటే రూ.700 తక్కువకు వడ్లు కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అసమర్థత వల్ల వేల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని విమర్శించారు.

పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు సమస్యలను పర్యవేక్షించాల్సిన మంత్రులు ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయిందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస మద్దతు ధరకు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్‌ చేశారు.

ధాన్యం క్వింటాకు రూ.2200 చెల్లించాలని, రూ.500 బోనస్‌ ఇవ్వాలన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని మంత్రులు అంటున్నారని, రైతుబంధు, రుణమాఫీ ఇవ్వలేదు కాబట్టే రైతులు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదన్నారు. బీఆరెస్‌ హయాంలో ప్రతి గింజా కొన్నామని, మద్దతు ధర ఇచ్చామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆరెస్ పార్టీ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News