Site icon vidhaatha

చేవెళ్లలో గెలిచి ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలి


విధాత, హైదరాబాద్ : చేవెళ్లలో బీఆరెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించడం ద్వారా పార్టీ ఫిరాయింపు దారులైన పట్నం, రంజిత్‌రెడ్డిలకు బుద్ధి చెప్పాలని బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. క‌ష్ట‌కాలంలో బీఆరెస్‌ పార్టీని వీడిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ రంజిరెడ్డిలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడు కూడా ప‌ట్ట‌లేడు అంటూ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్ల‌మెంట్ పరిధిలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయగా, నాలుగు స్థానాల్లో గెలిచామని గుర్తు చేశారు.


ప‌రిగి, వికారాబాద్‌, తాండూర్‌లలో వచ్చిన జనాన్ని చూసి గెలుపు ఖాయమని భావించానని, స్వ‌ల్ప తేడాతో ఓట‌మి పాల‌య్యామని, ఇందుకు పట్నం మహేందర్‌రెడ్డి వెన్నుపోటు కారణమన్నారు. ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడు కూడా ప‌ట్ట‌లేడు అని పెద్ద‌లు చెబుతారని, మంత్రిని చేశాం.. ఇక లొల్లి పెట్ట‌డు అనుకున్నామని, మెతుకు ఆనంద్, పైల‌ట్ రోహిత్ రెడ్డికి స‌హ‌క‌రిస్త‌డు అనుకున్నామని, కానీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఆయ‌న భార్య సునీత ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో అడ్డా పెట్టి, పార్టీలోనే ఉండుకుంటూ వెన్నుపోటు పొడిచి మ‌న నాయ‌కుల‌ను ఓడ‌గొట్టారని కేటీఆర్ ఆరోపించారు. మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి ఓట‌మికి మ‌న వాళ్లే కార‌ణం అనేది అక్ష‌ర స‌త్యమని, పట్నంను నమ్మి మోసం పోయాం అని కేటీఆర్ తెలిపారు.


పార్టీలు మారిన వారిని మళ్లా కాళ్లు పట్టుకున్నా తీసుకోం


కష్టకాలంలో పార్టీని వీడుతున్న వాళ్ళు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ పార్టీలోకి రానివ్వమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పార్టీ మారబోమంటు చివరిదాకా చెప్పి రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు ఇద్దరు కలిసి నమ్మించి మోసం చేశారని, నమ్మించడంలో వారు ఆస్కార్ పర్ఫామెన్స్ చేశారని, వాళ్లను పిచ్చోడిలా నమ్మానని కేటీఆర్ వాపోయారు. కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని, పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారని, వాళ్ళు చేస్తున్న విమర్శలను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు.


ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా, పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తానని, ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తానని, రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని, 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేశామని, 2019లో రంజిత్ రెడ్డి మాదిరి పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారని, కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్ లోకి పోయిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇదే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమన్నారు.



హామీల వైఫల్యాలపై దృష్టి మళ్లించేందుకే కేసుల లీక్‌లు


మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎం రేవంత్‌రెడిడ్డికే సవాల్ విసిరితే ఆయన స్పదించలేదన్నారు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండని, ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే అవినీతి కేసులు, ఫోన్ ట్యాపింగ్‌లంటూ ప్రజల దృష్టిని మళ్లీస్తున్నాడన్నారు. రైతులకు రుణమాఫీ, రూ. 4000 పించన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కాడని, ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలని డిమండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు పాలించినా ఆయన 420 హమీలు నేరవేర్చుడం సాధ్యం కాదన్నారు.


రేవంత్ సర్కార్‌కు ఆ రెండు జిల్లాల నేతలే మానవ బాంబులు


సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీలోని నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ను బీజేపీ బీ – టీమ్ అన్నారని, కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డినే బీజేపీకి బీ-టీమ్ గా మారిండని విమర్శించారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నారా… లేదా మోడీ కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదని, బీజేపీని ఆపేందుకు బలమైన పార్టీలు ప్రాంతీయ పార్టీలేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బీజేపీ కి లాభం అవుతుందని, పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని కొనియాడారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని, తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్‌ను బలోపేతం చేసేందుకు ఎంపీ ఎన్నికల్లో గెలువాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఆరెస్ మాత్రమేనని, 13 వ తేదీన జరిగే చేవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలి రావాలని కోరారు.


కడదాకా కేసీఆర్‌తోనే ఉంటాం : సబితా, కార్తీక్‌ల స్పష్టీకరణ


బీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి, కుమారుడు ప‌టోళ్ల కార్తీక్ రెడ్డిలు మాట్లాడుతూ తాము బీఆరెస్‌ పార్టీ వీడుతున్నట్లు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని, చివ‌రి శ్వాస వ‌ర‌కు కేసీఆర్‌తోనే త‌మ ప్ర‌యాణం కొన‌సాగుతోంద‌ని తేల్చిచెప్పారు. ఇక్కడి ప్రజలు ప‌టోళ్ల ఇంద్రారెడ్డికి ఐదు సార్లు, స‌బితమ్మ‌కు ఐదు సార్లు అవ‌కాశం ఇచ్చారని, 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దిసార్లు జిల్లా ప్ర‌జ‌ల ఆశీస్సులు పొందామన్నారు. మా ప్ర‌స్థానం వేరు.. ఇప్పుడు పార్టీలు మారుతున్న వారి ప్ర‌స్థానం వేరు అని, వారికి మాకు చాలా తేడా ఉందని స్ప‌ష్టం చేశారు. తాజాగా పార్టీలు మారేవారితో మ‌మ్మ‌ల్ని పోల్చ‌కండని, ఎన్టీఆర్, వైఎస్సార్‌తో ఎలా ఉన్నామో కేసీఆర్ వ‌ద్ద కూడా చివ‌రి శ్వాస వరకు ఉంటామని స్పష్టం చేశారు.

Exit mobile version