Site icon vidhaatha

KTR | అరచేతిలో వైకుంఠంతోనే అధికారం

 

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపెట్టారని, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాకా వాటిని అమలు చేయడం లేదంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శించారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మేడిప‌ల్లిలో నిర్వ‌హించిన బీఆరెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చి 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ హెచ్చ‌రించారు.

డిసెంబ‌ర్ 9న సీఎం కాగానే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై సంత‌కం పెడుతాన‌ని చెప్పిన రేవంత్‌రెడ్డి నేటికి సంతకం పెట్టలేదన్నారు. సంవ‌త్స‌రంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పారని, రైతుల‌కు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమ‌లు కాలేదన్నారు. నా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర జ‌రుగుతుంద‌ని రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఆయన ప్ర‌భుత్వం ఐదేండ్లు ఉండాల‌ని కోరుకుంటున్నామని, 420 హామీలు అమ‌లు చేయకపోతే ప్ర‌జ‌లంద‌ర్నీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్ పార్టీని రాజ‌కీయంగానే బొంద పెడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి ప‌క్క‌నే న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం మాన‌వ‌బాంబులు ఉన్నాయని, వాళ్లే నిన్ను ఇబ్బంది పెడుతారని హెచ్చరించారు. నీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ఖ‌ర్మ మాకు అవ‌స‌రం లేదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేక ఆటోమేటిక్‌గా నీవే ఫెయిల్ అవుతావని రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సంప‌ద‌ను పెంచే తెలివి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్ర‌ద్ద వాట‌ర్ ట్యాపింగ్స్ మీద పెట్టాలని, ఊర్లలో వాటర్‌ ట్యాంక‌ర్లు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం 14 ఏండ్లు క‌ష్ట‌ప‌డ‌డ‌మే కాకుండా, చావు నోట్లో త‌ల‌పెట్టి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.

కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ ఉంచాల‌ని చెప్పి 10 ఏండ్లు అవ‌కాశం ఇచ్చారని, క‌రెంట్, తాగు, సాగు నీటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నామని, ఇక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసి ప్ర‌తి కుటుంబానికి మేలు చేశామని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారని, కేసీఆర్ మాదిరిగా సాగుతాగునీళ్ల సమస్యలు లేకుండా చూడాలని, ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచిస్తున్నామన్నారు. రాజ‌కీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప‌ని చేయాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారని, ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తూ ఎన్నో అంశాల‌పై పోరాటం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ వంటి పలు ఎంపీ సీట్లలో డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే వారు పెట్టిన డ‌మ్మీ అభ్య‌ర్థులను ఓడించాలని, చేవెళ్ల‌లో ప‌నికిరాని చెత్త‌ను మ‌ల్కాజ్‌గిరి ముఖం మీద ప‌డేసిండని, కాంగ్రెస్ పార్టీ క‌రీంన‌గ‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంత న‌ష్టం జ‌రిగిందో మీ కండ్ల ముందే ఉందన్నారు.

మ‌ళ్లా ఒక్క‌సారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మోస‌పోతారని, స్థానికుడైన రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజ్‌గిరి ప్రజలు గెలిపించుకోవాలన్నారు. కేసీఆర్‌, బీఆరెస్ ఉండొద్దని కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత 30 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతాడని కేటీఆర్ జోస్యం చెప్పారు.గ‌త ప‌దేండ్ల‌లో దాదాపు 8 ప్ర‌భుత్వాల‌ను ప్రధాని మోదీ కూల‌గొట్టారని, మోదీ ఎవ‌ర్నీ బ‌త‌క‌నిస్త‌లేడని, ప్ర‌తిప‌క్షాలు ఉంటే జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలన్నదే మోదీ నినాదంగా మారిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సైతం ఆ భ‌యంతోనే జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

రాహుల్‌గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోడిని చేస్తున్నాడని,త‌న కోసం రేవంత్ ప‌ని చేస్తున్నాడ‌ని రాహుల్ అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెండు నాల్క‌ల ధోర‌ణి సాగుతుందని, మోదీని ఒక‌రు ప్ర‌శంసిస్తే.. మ‌రొక‌రేమో ఆయ‌నను విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం 14లక్షల కోట్ల కార్పోరేటర్లకు బ్యాంకు రుణాలు మాఫీ చేసి, రైతులకు రుణమాఫీ మాత్రం చేయడం లేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలుచేయలేదుగాని రాష్ట్ర ప్రజల ఓట్లు మాత్రం బీజేపీకి కావాలని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరితేనే పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతుకు వినబడుతుందన్నారు.

Exit mobile version