Site icon vidhaatha

బీజేపీ మెడకు కులగణన ఉచ్చు!

• ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అనుకూలత

• ఇప్పటికే ఇండియా కూటమి డిమాండ్‌

• ఓబీసీలు బీజేపీకి దూరమయ్యే చాన్స్‌

• బీహార్‌ కులగణనతో దేశవ్యాప్త చర్చలు

• 2024 ఎన్నికల్లో మిత్రులే బీజేపీకి దిక్కు!

• కానీ ఎన్డీయేలోనూ కుల గణనకు మద్దతు

• అనేక మిత్రపక్షాల ఓటు బ్యాంకు ఓబీసీలే

• కుల గణనను ఆసరా చేసుకోనున్న ‘ఇండియా’

• ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ

• బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశాలు!



న్యూఢిల్లీ: బీహార్‌ కులగణన అంశం.. బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. బీహార్‌లో ఓబీసీలు 63% ఉన్నారని లెక్కలు తేల్చాయి. అందులోనూ అధికభాగం ఎంబీసీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొంటే అది 85% వరకూ వెళుతున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కులాలవారీగా సర్వే జరుగలేదు. బీహార్‌ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చేసి, అనేక అడ్డంకులు ఎదురైనా కులగణనను పూర్తిచేసింది. నివేదికను కూడా వెల్లడించింది. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా కులగణన చర్చనీయాంశమైంది. బీహార్‌ తరహా కుల గణనను రాబోయే జనాభా లెక్కల సందర్భంగా చేపట్టాలనే డిమాండ్‌ ఊపందుకున్నది. ఇప్పటికే ఇండియా కూటమి ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చింది.



తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని కూడా ప్రకటించింది. మరోవైపు ఎన్డీయే, ఇండియా కూటములకు వెలుపల ఉన్న బీఎస్పీ వంటి పార్టీలు సైతం కులగణనకు మద్దతు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలోని పలు పక్షాలు సైతం కులగణనను డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితి కుల గణనకు అయిష్టతతో ఉన్న బీజేపీని సందిగ్ధ స్థితిలోకి నెడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరో ఎనిమిది నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన సొంత బలంపై ఆధారపడి అద్భుతాలు సృష్టించే పరిస్థితి కనిపించడం లేదు. అగ్రవర్ణాల ఓట్లు గట్టెక్కిస్తాయనే వాతావరణం కూడా లేదు. అంతేకాదు.. బీసీలకు జనాభా దామాషాలో రాజకీయ, ఆర్థిక అవకాశాలు కూడా కల్పించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. అయితే.. కులగణన చేపడటమా? లేదా? అన్న సంగతిని పక్కనపెట్టేసి.. కుల గణన ద్వారా హక్కులను కూడా అదే నిష్పత్తిలో పంచుతారా? అని ప్రధాని మోదీ వితండవాదాన్ని ముందుకు తేవడం విశేషం.

అఫిడవిట్‌తో ఎన్డీయేలో వ్యతిరేక భావన


దేశంలో కులగణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని పేర్కొంటూ మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ పట్ల ఎన్డీయే పక్షాలు సానుకూలంగా లేవు. వెంటనే ఆ అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకున్నా.. ఎన్డీయే పక్షాల్లో ఒక వ్యతిరేక భావన మాత్రం నాటుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కుల గణను ఎన్డీయేలోని పార్టీలు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ కూడా సానుకూలంగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


‘మా నాయకులు తరచూ ఈ విషయాన్ని బీజేపీ నాయకత్వం వద్ద ప్రస్తావిస్తూనే ఉన్నారు. మా పార్టీ కుల ప్రాతిపదికన జన గణనను సమర్థిస్తున్నది. దీనిని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. మా డిమాండ్లపై ప్రధాన మంత్రి, హోంమంత్రికి అవగాహన ఉన్నది’ అని అప్నాదళ్‌ (సోనేవాల్‌) నేత సునీల్‌ పటేల్‌ చెప్పారు. అప్నాదళ్‌ ప్రస్తుతం యూపీలో బీజేపీకి మద్దతు ఇస్తున్నది. అప్నాదళ్‌తోపాటు.. బీజేపీ ఇటీవల సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌జే), నిర్బల్‌ ఇండియన్‌ షోషిత్‌ హమారా ఆమ్‌ దళ్‌ (ఎన్‌ఐఎస్‌హెచ్‌ఏడీ-నిషాద్‌) లను ఎన్డీయేలో చేర్చుకున్నది. ఈ రెండు పార్టీలు కూడా ఓబీసీ ఓటు బ్యాంకు ఆధారితమే.


యోగితో సమస్య


కుల గణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటే.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మాత్రం కుల గణనకు తమ మద్దతు ఉండబోదని విస్పష్టంగానే ప్రకటిస్తున్నారు. సామాజిక న్యాయం అనే ప్రధాన ఉద్దేశంతో తాము కుల గణనకు మద్దతు పలుకుతున్నామని నిషాద్‌ పార్టీ నేత ఒకరు చెప్పారు. తమకు ఇది రాజకీయ అంశం కాదని, ఇది చేయాల్సిన పనిగా భావిస్తున్నామని, సామాజిక న్యాయం కోసం మేం చేసే పోరాటానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని అప్నాదళ్‌ (సోనేవాల్‌) నేత, కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ లేవనెత్తారు.


మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీలకు కోటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతునివ్వడంతోపాటు.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం మద్దతు తెలుపడం బీజేపీకి తలనొప్పిగా పరిణమించింది. అయితే.. దేశవ్యాప్తంగా జనగణన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ కోటాకు అవకాశం ఉంటుందని బీజేపీ చెబుతూ వస్తున్నది. ఈ రెండు అంశాలూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ఈ రెండింటికీ తాము మద్దతు ఇస్తున్నామన్న అనుప్రియ పటేల్‌.. సాధ్యమైనంత త్వరలో కేంద్రం జనగణనను పూర్తిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఎన్డీయే ప్రతివ్యూహం


కులగణన పేరుతో ప్రతిపక్ష ఇండియా కూటమి తమను ఇరకాటంలో పడేస్తున్నదన్న విషయాన్ని గ్రహించిన బీజేపీ.. ప్రతిపక్షాలపై ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. బీహార్‌లో కుల గణన పూర్తయిన తర్వాత దాని ఆధారంగా సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల హామీలు ఉంటాయని ఎన్డీయే భయపడింది. కుల గణనను దేశవ్యాప్తంగా చేపడతామని ఇండియా కూటమి ఇప్పటికే ప్రకటించింది. దానికి ఉన్న అవకాశాలకు బీహార్‌ నమూనాను ఉదాహరణగా చూపుతాయని ఎన్డీయే నాయకత్వం భావించింది. ఇది బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను ఆకర్షించే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘బీహార్‌లో కుల గణన పూర్తయిన తర్వాత ఇండియా కూటమి దేశమంతటా ఇదే తరహా సర్వే చేపడుతాయని ప్రకటిస్తుందని మేం బీజేపీ నాయకత్వానికి చెబుతూనే ఉన్నాం.



ప్రతిపక్షాలను ఎన్డీయే ప్రత్యేకించి బీజేపీ ఈ విషయంలో టార్గెట్‌ చేస్తాయని మేం భయపడ్డాం’ అని లోక్‌జనశక్తి పార్టీ (రాంవిలాస్‌) నేత ఒకరు తెలిపారు. తమ సంకీర్ణ కూటమి విజయం అనేది బీజేపీ నాయకత్వం గెలుపుపైనే ఆధారపడి ఉంటుందని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు తెలుసని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మళ్లీ అధికారం దక్కాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది. ‘మావి చిన్న పార్టీలు. మా ఓటు బలం వేణ్ణీళ్లకు చన్నీళ్లు అన్నట్టే ఉంటుందని, మెజార్టీ సీట్లు గెలవాలంటే మాకు బీజేపీ మద్దతు కీలకం. ఈ సమయంలో కుల గణనపై ప్రతిపక్షాల వ్యూహాలను కౌంటర్‌ చేయడం అత్యంత కీలకం’ అని లోక్‌జనశక్తి పార్టీ నేత చెప్పారు.


2024లో కుల గణనే కీలకాస్త్రం!


బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక ఓటు బ్యాంకుపై ప్రతిపక్ష ఇండియా కూటమి దృష్టిసారించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘కుల గణన అనేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో కీలకాస్త్రంగా ఉండబోతున్నది. ఈ విషయంలో ఇండియా కూటమిని ఎదుర్కొనడం దుర్లభమని బీజేపీ మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ-ఎన్డీయే ఓటు బ్యాంకును ఇండియా కూటమి కొల్లగొట్టడం ఖాయం’ అని ముంబైకి చెందిన రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల వ్యూహకర్త జై మృంగ్‌ అభిప్రాయపడ్డారు.



తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం


కుల గణన చేపట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే అసెంబ్లీల్లో తీర్మనాలు చేశాయి. పేరుకు తీర్మానాలు చేసినా.. అధికార పార్టీ నాయకత్వాలు ఓబీసీ క్యాటగిరీకి చెందని కారణంగా కులగణన జరిగే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సొంతగా కుల గణన చేపట్టే ఆసక్తి కూడా లేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో కుల గణన కూడా చేపట్టినప్పటికీ.. వివరాలను బయటపెట్టలేదు. కేంద్రాన్ని కుల గణనకు డిమాండ్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. సమగ్ర కుటుంబ సర్వేలో కుల గణన వివరాలను బయటపెట్టకపోవడం గమనార్హం. బీసీలు 50శాతం ఉన్నారని చెప్పడమే కానీ.. కులాల వారీగా జనాభా లెక్కలను వెల్లడించలేదు. అయితే.. ఓబీసీలు 60శాతానికిపైగానే ఉంటారని వివిధ ప్రజాసంఘాలు చెబుతున్నాయి.


బీహార్‌లో ఈసారి కష్టమే!


బీహార్‌లో 40 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 పనితీరును మరోసారి ప్రదర్శించాలని బీజేపీ ఆశతో ఉన్నది. అయితే అప్పట్లో బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఎన్డీలో ఉన్నారు. దానితోపాటు రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ కూడా భాగస్వామిగా ఉన్న పరిస్థితిలో ఎన్డీయేకు 39 స్థానాలు లభించాయి. అయితే.. మారిన పరిస్థితుల్లో బీజేపీ కొత్త వ్యూహాన్ని అనుసరించాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. బీహార్‌ కులగణ ప్రభావం రాబోయే ఎన్నికలపై గణనీయంగా ఉండబోతున్నదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీహార్‌ బీజేపీ చీఫ్‌ సమ్రత్‌చౌదరి ఆచితూచి స్పందించారు. ‘మేం మొదట ఆ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత దానిపై విధాపరమైన ప్రకటన విడుదల చేస్తాం’ అని ఆయన తెలిపారు.




ప్రస్తుతానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రమంత్రి అమిత్‌షా తదితరులతో సంప్రదింపులు జరుపుతున్నది. బీసీలు, ఎంబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్‌ కోటాలోనే సబ్‌ కోటా అంశంపై రోహిణి కమిషన్‌ సిఫార్సులకు సంబంధించి కేంద్ర నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఇరుకున పడటం బీహార్‌లోని జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, మూడు వామపక్ష పార్టీలతో కూడి మహాకూటమికి కలిసొచ్చే అంశమని పరిశీలకులు చెబుతున్నారు. బీహార్‌లో ఎంఐఎం నుంచికూడా సమస్య ఉన్నది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అందులో ఐదుగురు తర్వాత ఆర్జేడీలో చేరిపోయారు. అయినప్పటికీ.. ముస్లిం ఓటర్లలో ఎంఐఎం గణనీయ ప్రభావం చూపొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.




ఈ పరిస్థితిలో బీహార్‌లో పూర్వ వైభవానికి బీజేపీకి అంత సులభమేమీ కాదని చెబుతున్నారు. అందుకే వికాస్‌శీల్ ఇన్సాన్‌ పార్టీ వంటి ఇతర చిన్న పార్టీలను ఎన్డీయేవైపు తిప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ పార్టీ అధినేత ముకేశ్‌ సాహానీ సామాజిక వర్గ గ్రూపులైన కేవాట్స్‌ (పడవలు నడిపేవారు), మల్లాహ్‌లు (మత్స్యకారులు) వంటివాటిని ఆకర్షించాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ సహజంగానే కూటమిలో ఆధిక్య భావాన్ని ప్రదర్శిస్తుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. దానిని పక్కనపెట్టి.. తన భాగస్వామ్య పార్టీలతో సయోధ్యతో మెలగాల్సి ఉంటుందని అంటున్నారు. మోదీయే గెలిపిస్తాడని, మిగిలిన అన్ని భాగస్వామ్య పార్టీలు డమ్మీలేననే భావనలో ఉండే బీజేపీ ఆ భావనలను తొలగించుకుంటుందా? భాగస్వామ్య పక్షాలు డిమాండ్‌ చేస్తున్న కుల గణనకు సానుకూలత వ్యక్తం చేస్తుందా? అనేది సందేహమే!

Exit mobile version