White Cat | తెలుగు రాష్ట్రాల్లో పిల్లిని చాలా మంది శుభ సూచకంగా భావించరు. మనం ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నా, ఒక మంచి పనిని తలపెట్టేందుకు వెళ్తున్న సమయంలో పిల్లి ఎదురుగా వస్తే అపశకునంగా భావించి, వెనక్కి వచ్చేస్తాం. మళ్లీ కాసేపటి తర్వాత మన ప్రయాణాన్ని ప్రారంభిస్తాం.
అయితే కొంత మంది పిల్లులను ఇష్టంగా పెంచుకుంటారు. తెలుపు రంగులో ఉండే పిల్లులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. నలుపు రంగులో ఉండే పిల్లులకు దూరంగా ఉంటారు. మొత్తానికి పిల్లులు అంటే ఒక రకమైన చెడు భావన ఉంది సమాజంలో. అయినప్పటికీ ఓ వ్యక్తి మాత్రం రూ. 50 వేలు పెట్టి ఓ పిల్లిని కొనుగోలు చేశాడు. తన ఖరీదైన పిల్లిని అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఆ పిల్లి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీ వాసి షేక్ అజహార్ మహ్మద్ అనే వ్యక్తి ఓ పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశాడు. ఈ పిల్లి థాయ్‌లాండ్ జాతికి చెందినది. దీని కళ్లు ఒకటి బ్లూ కలర్‌లో, మరొకటి గ్రీన్ కలర్‌లో ఉండటమే ప్రత్యేకత. శరీరమంతా పాల వలే తెలుపు రంగులో ఉంది. సొంత బిడ్డలా చూసుకుంటున్న ఈ పిల్లికి నోమనీ అని పేరు పెట్టాడు మహ్మద్.
అయితే ఈ నెల 8వ తేదీన రాత్రి సమయంలో మహ్మద్ ఇంటి నుంచి పిల్లి బయటకు వచ్చింది. అటుగా వెళ్తున్న సోనూ కంట పిల్లి పడింది. దాని కళ్లు సోనూను ఆకర్షించాయి. ముద్దుగా ఉన్న ఆ పిల్లిని సోనూ అపహరించాడు. తన పిల్లిని ఎవరో ఎత్తుకెళ్లారని, మహ్మద్ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న సోనూ వద్ద పిల్లిని గుర్తించి, మహ్మద్‌కు అప్పజెప్పారు. ఇక ఈ పిల్లి వార్త.. అటు వార్తా పత్రికల్లో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.