తొలి విడత పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా సాగింది. 21 రాష్ట్రాలు.. 102 స్థానాలలో పోలింగ్ జరిగింది

  • Publish Date - April 19, 2024 / 03:05 PM IST

ఓటేసిన ప్రముఖులు..సెలబ్రిటీలు

విధాత: దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా సాగింది. 21 రాష్ట్రాలు.. 102 స్థానాలలో పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కిం, త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్‌, మ‌ణిపూర్‌, మిజోరం, జ‌మ్ము కశ్మీర్‌ రాష్ట్రాలున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో 60అసెంబ్లీ స్థానాలకు గాను ఏకగ్రీవమైన 10స్థానాలు మినహా 50స్థానాలకు, సిక్కింలోని 32అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు పలువురు ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు అటు సినీ, రాజకీయ ప్రముఖులూ ఉదయమే పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. తలైవా రజినీ కాంత్ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. . ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే దేశాన్ని గౌరవించడమే అని వెల్లడించారు. ఆయనతో పాటు సినీ ప్రముఖులు అజిత్, శివకార్తికేయన్, ధనుష్‌, ఖుష్బూ సుందర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో అజిత్ తిరువణ్మియర్‌లో ఓటు వేశారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలోని కోయంబెడు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన పార్టీ ఎన్నికల బరిలో లేకపోయినా అధికార డీఎంకేకు మద్దతునిస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ చీఫ్ అన్నమలై కోయంబత్తూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తేని నియోజకవర్గంలో ఓటు వేశారు. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో హీరోయిన్ త్రిష, రాధిక శరత్ కుమార్ దంపతులు, కూతురు వరలక్ష్మి, విజయ్ సేతుపతి, సూర్య జ్యోతికలు, స్నేహ దంపతులు, హీరో విశాల్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్రకారం దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు స్థానాల‌కు.. ఏడు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌రగనుంది. అందులోభాగంగా తొలి విడత పోలింగ్‌ శుక్రవారం కొనసాగింది. తొలి విడతలో మొత్తం ఎనిమిది మంది మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్‌ పోటీలో ఉన్నారు. నాగ్‌పుర్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కర్, అరుణాచల్‌ వెస్ట్‌ నుంచి కిరణ్ రిజిజు, డిబ్రూగఢ్‌ స్థానం నుంచి సర్బానంద సోనోవాల్‌, అర్జున్‌ మేఘవాల్‌, ఎల్‌.మురుగన్‌ ఉన్నారు. త్రిపురలో రెండు స్థానాలుండగా, వెస్ట్‌ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ పోటీలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. చెన్నై సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Latest News