Site icon vidhaatha

Chandrayaan-3 | జాబిలమ్మ అందాలని.. నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్‌-3

Chandrayaan-3

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -3 విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్‌ -3 వాహక నౌక ఎల్‌వీఎం3 రాకెట్‌.. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. ప్రయోగించిన 16 నిమిషాల తర్వాత రాకెట్‌ నుంచి చంద్రయాన్‌-3 విడిపడింది.

ఇది భూమి చుట్టూ ఐదారు సార్లు దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమిస్తుంది. ఆ సమయంలో భూమికి దగ్గరగా 170 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. గరిష్ఠంగా 36,500 కిలోమీటర్ల ఎడం ఉంటుంది. భూ కక్ష్యలో 40 రోజులపాటు పరిభ్రమిస్తూ.. అనంతరం చంద్రుడి దిశగా సాగుతుంది. ఆగస్ట్‌ 23-24 తేదీల్లో చంద్రుడిపై కాలుమోపనున్నది.

ఇందులోని విక్రం ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ లాండ్‌ అయిన తర్వాత దాని నుంచి ప్రజ్ఞ రోవర్‌ బయటకు వస్తుంది. అనంతరం చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి వివరాలను సేకరిస్తుంది. చంద్రుడిపై సూర్యకాంతి ఉండే కాలానికి అనుగుణంగా ల్యాండింగ్‌ తేదీలను నిర్ణయించారు.

సూర్యకాంతి ఉండటం వల్ల లాండర్‌కు ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ రీచార్జ్‌ అయ్యేందుకు వీలు కలుగుతుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమిపై 14 రోజులతో సమానం. ఈ 14 రోజులు చంద్రుడిపై నిరవధికంగా సూర్యకాంతి ఉంటుంది. అనుకోని అవాంతరాలతో ప్రయోగం వాయిదా పడిన పక్షంలో ఇస్రో వచ్చే నెల వరకూ ఆగాల్సి వచ్చేది.

కంగ్రాట్స్‌ ఇండియా

చంద్రయాన్‌ -3 విజయవంతంగా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన అనంతరం ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ ‘భారత్‌కు అభినందనలు. చంద్రుడి దిశగా చంద్రయాన్‌ -3 తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మన ప్రియమైన ఎల్‌వీఎం 3.. చంద్రయాన్‌ -3ని భూ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

రానున్న రోజుల్లో చంద్రుడి దిశగా చేసే ప్రయాణంలో విజయవంతం కావలని మనమంతా ఆకాంక్షిద్దాం’ అన్నారు. ఇస్రోకు అత్యంత నమ్మకమైన రాకెట్‌గా ఎల్‌వీఎం3 మరోసారి రుజువు చేసుకున్నదని చంద్రయాన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌ మోహనకుమార్‌ చెప్పారు. లాంచ్‌ ఫ్రీక్వెన్సీని మరింత పెంచే ప్రక్రియలో ఉన్నామని తెలిపారు.

మనది నాలుగో దేశం

చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ విజయవంతంగా నిర్వహించిన పక్షంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో భారత్‌ నిలుస్తుంది. చంద్రుడిపైకి ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ వెళతాయి. దీని మొత్తం బరువు 3,900 కిలోలు. చంద్రయాన్‌ విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. మన దేశపు కలలను ఆశలను ఈ మిషన్‌ మోసుకుపోయిందని పేర్కొన్నారు.

Exit mobile version