విధాత: శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో అన్ని రంగాలతో పాటు వైద్య, ఆరోగ్య రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. అమెరికాకు చెందిన న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్.. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌పేస్ (బీసీఐ) సాంకేతికతపై కాలిఫొర్నియా ఫ్రెమోంట్ లోని ప్రధాన కార్యాలయంలో కీలక ప్రకటన చేశారు.
ఆరు నెలల్లో మానవుల మెదడులో చిప్‌ను అమర్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలియజేశారు. దీనికి సంబంధించి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. మనిషి మెదడులో చిప్ అమర్చడం వల్ల కూర్చున్న చోటు నుంచి అన్ని పనులు ఆపరేట్ చేయవచ్చని చెబుతున్నారు అంటే టీవీ, ఫోన్, ఫ్యాన్ ఇలా ఏదైనా కూర్చన్న చోటు నుంచే కదలకండా ఆపరేట్ చేయవచ్చట.
మనిషి మెదడులో చిప్‌ను అమర్చే ప్రక్రియ విజయవంతమైతే.. ఇక మనిషికి రోగాల పీడ వదలనున్నది. పక్షవాతం వస్తే.. వెన్నులో ఓ చిప్‌ను అమర్చితే కాళ్లు, చేతుల్లో కదలికలు వస్తాయి. పడిపోయిన నోటి మాట వస్తుంది. కంటి చూపు పోతే కూడా ఓ చిప్ అమర్చటం ద్వారా చూపును తిరిగి పొందవచ్చు.
అంతెందుకు.. మన శరీరంలో ఏ అవయవం పనిచేయక పోయినా ఓ చిప్ అమర్చుకోవటం ద్వారా అంగ వైకల్యాన్ని అధిగమించే ఆధునిక కాలం రానున్నది. ఇలాంటి పరిశోధనలు ఇంకా ముందుకు పోతే.. ఇక మనిషి చిరంజీవి కానున్నాడు. వృద్ధాప్యం, మరణం లేని విధంగా మనిషి చిప్‌ల సాయంతో ఎల్లకాలం బతికేయ వచ్చన్న మాట!