CJI | కుర్చీలో వంకరగా కూర్చుంటే ట్రోల్ చేశారు : సీజేఐ డీవై చంద్రచూడ్‌

  • Publish Date - March 24, 2024 / 01:38 AM IST

CJI : జడ్జి సీట్లో తాను కూర్చున్న విధానాన్ని కూడా ట్రోల్‌ చేయడం బాధాకరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఓ కేసు విచారణ సమయంలో నడుము నొప్పిగా అనిపించడంతో భంగిమను కొద్దిగా మార్చుకుని కూర్చున్నానని, అందుకు తనను విపరీతంగా ట్రోల్‌ చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

‘ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా నడుము నొప్పిగా అనిపించి కూర్చునే భంగిమను కొద్దిగా సరి చేసుకున్నా. దానిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అనుచిత కామెంట్స్ చేశారు. నేను నిర్లక్ష్యంగా కూర్చున్నానని విమర్శలు చేశారు. గత 24 ఏళ్ల నుంచి న్యాయమూర్తిగా కేసులు వింటున్నా. కుర్చీలో కూర్చునే భంగిమను కూడా ట్రోలింగ్‌కు వాడుకోవడం దురదృష్టకరం’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తులు, సంబంధిత అధికారులు పని జీవితాన్ని, ఒత్తిడిని సమతుల్యం చేసుకోవాలని ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్‌ సూచించారు. న్యాయవ్యవస్థలోని ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగాలను, ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరని చెప్పారు. కార్యక్రమంలో జస్టిస్‌ అజ్జికుట్టిర ఎస్‌ బోపణ్ణ, జస్టిస్‌ (రిటైర్డ్‌) అరవిందకుమార్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News